భారత పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. చైనా అణ్వాయుధాలతో రెచ్చిపోతోంది. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెచ్చుమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేసే నిర్ణయం తీసుకుంది ఇండియన్ ఆర్మీ. ఫార్వర్డ్ ఏరియాల్లో రక్షణ దళాలను బలోపేతం చేసే దిశగా భారత సైన్యం చర్యలు చేపడుతోంది. చైనా, పాక్ ఉద్రిక్తతల మధ్య న్యూక్లియర్ షీల్డ్‌ను ఇండియన్ ఆర్మీ నిర్మించడం తాజాగా ప్రారంభించింది.
యుద్ధస్థావరాల సమీప ప్రాంతాల్లో సాయుధ బలగాల కోసం న్యూక్లియర్ హార్డెండ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసింది. అంతేకాదు ఆయుధాల రక్షణార్థం సొరంగాల నిర్మాణానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్మీ సంపాదిస్తోంది. పరికరాలను సైతం భారత సైన్యం కొనుగోలు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
మందుగుండు సామగ్రి స్టోరేజ్ కోసం సొరంగాలు ఇండియన్ ఆర్మీ శరవేగంగా నిర్మిస్తోంది. దీనికితోడు న్యూక్లియర్ పేలుడును తట్టుకునేలా బూట్క్యాంపులు మెరుగుపరిచేందుకు న్యూక్లియర్-హార్డెండ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది.
సొరంగాలు, న్యూక్లియర్-హార్డెండ్ సౌకర్యాలపై స్పెషల్ ఫోకస్
మైక్రో టన్నెలింగ్ పనులు కొనసాగుతున్నాయని ఇండియన్ ఆర్మీ ఇంజనీర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తెలిపారు. మైక్రో టన్నెలింగ్ అనేది ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ఒక మిలటరీ టెక్నిక్ అని జనరల్ తెలిపారు. ఇది రక్షణ, కార్యాచరణ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రక్షిస్తుందని ఆయన వివరించారు. ఆర్మీ, వైమానిక దళాల కోసం మందుగుండు సామగ్రిని సొరంగాల్లో స్టోరేజ్ చేయాలని నిర్ణయించిన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ వెల్లడించారు.
మైక్రో-టన్నెల్లింగ్ అనేది 500మి.మీ - 4,000మి.మీ వరకు వ్యాసం కలిగిన యుటిలిటీ టన్నెల్లను నిర్మించడానికి ఉపయోగించే ఒక మిలటరీ టెక్నాలజీ. రిమోట్-కంట్రోల్డ్ డ్రిల్లింగ్, పైప్-జాకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి మైక్రో-టన్నెల్స్ నిర్మిస్తారు. డ్రిల్లింగ్ సిస్టమ్ అనేది భూగర్భజలాలు, భూమి ఒత్తిడిని సమతుల్యం చేయడానికి లిక్విడ్ ప్రెజర్‌ను అన్వయించడం ద్వారా తవ్వకాల భూమికి సపోర్ట్ అందిస్తుంది. సొరంగాల నిర్మాణం వల్ల శత్రువుల కాల్పుల సమయంలో కూడా సాయుధ దళాల ఆయుధాలు సురక్షితంగా ఉంటాయి.
"భూమిపై బూట్‌క్యాంప్‌ల సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఫార్వర్డ్ లొకేషన్స్‌లో న్యూక్లియర్-హార్డెండ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం." అని లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ఇంజనీర్-ఇన్-చీఫ్, ఇండియన్ ఆర్మీ అన్నారు
ఈ సొరంగాలు అణు కోటలుగా పనిచేస్తూ శత్రువుల దాడి నుంచి కీలకమైన మౌలిక సదుపాయాలను కాపాడతాయి. ఈ సొరంగాల నిర్మాణానికి అణ్వాయుధ చైనా & పాకిస్థాన్‌తో నెలకొన్న వివాదమే ప్రధాన కారణం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత మిలిటరీ, చైనీస్ ఆర్మీ మధ్య మౌలిక సదుపాయాల మధ్య ఉన్న తేడాను తగ్గించడంలో ఈ సౌకర్యాల నిర్మాణం దోహదపడుతుంది.
మైక్రో-టన్నెల్స్ సాయుధ దళాలకు ఎలా సహాయం చేస్తాయి?
ఇప్పటికే చైనా, యూఎస్‌తో సహా మిగతా దేశాల సైన్యాలు అండర్‌గ్రౌండ్ మందుగుండు స్టోరేజ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇవి మెరుగైన భద్రతను అందిస్తూ శత్రువుల పరిశీలన నుంచి సామాగ్రిని గోప్యంగా దాచిపెడతాయి. అలాగే ఇవి శత్రువుల ఉపగ్రహ చిత్రాలకు చిక్కకుండా ఆయుధాలను భద్రపరుస్తాయి. సున్నితమైన మందుగుండు సామగ్రి ప్రమాదవశాత్తు పేలిపోయే అవకాశాలను ఈ సొరంగాలు తగ్గించగలవు.
భారత సరిహద్దుల్లో ఆందోళనలు
మే, 2020 నుంచి భారతదేశం, చైనా మధ్య వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారీ సరిహద్దు ఘర్షణలు జరిగాయి. అక్టోబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని బమ్ లా సరిహద్దు సెక్టార్లో వాస్తవాధీన రేఖ సమీపంలో ఇంటెన్సివ్ డ్రిల్లు భారత సైన్యం నిర్వహించింది. బంకర్ల నుంచే భారతీయ నిర్మాణాలపై చైనా ట్యాంక్ దాడులను సైన్యం తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ తన పరికరాలు, మందుగుండు సామాగ్రి రక్షణపై దృష్టి సారించినట్లు చెప్పడానికి ఇదేనిదర్శనమని నివేదికలు తెలుపుతున్నాయి.
అక్టోబర్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణ పాయింట్ల వద్ద విభేదాలను పరిష్కరించడానికి 13వ రౌండ్ చర్చలను భారత సైన్యం, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించాయి. భారత్, చైనాలు త్వరలో 14వ రౌండ్ సీనియర్ ఆర్మీ కమాండర్ల సమావేశం నిర్వహించే అవకాశముంది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని కొనసాగించేందుకు చైనా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
భౌగోళిక సమస్యలను పరిష్కరించేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఎల్ఏసీలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భారతదేశం వాదిస్తోంది. మరోవైపు ఉగ్రవాదుల చొరబాటుతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణానికి పొరుగు దేశం పాకిస్థాన్ తెరలేపుతోంది. ఈ విధంగా చైనా, పాక్ ప్రవర్తిస్తుండటంతో మందుగుండు సామాగ్రి వీరికి రక్షణ కల్పించాల్సిన అవసరముందని భావించి ఇండియన్ ఆర్మీ తగిన చర్యలు చేపడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army, Defence Ministry