దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన వేళ జమ్మూకశ్మీర్ లోని కతువా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాంకేతిక కారణంతో ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ఓ పైలట్ మృతి చెందారు. మరో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ధ్రువ్ హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య కారణంగా కతువా జిల్లాలోని లఖ్నపూర్ ఎరియాలో క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇండయన్ ఆర్మీ ధ్రువీకరించింది. మంటలు చెలరేగి హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక పైలట్ మరణించారు. ఈ ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అయితే తీగల్లో చుట్టుకున్న అనంతరం హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.