హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Free Air tickets: ఒలింపిక్ విజేతలకు బంపర్ ఆఫర్.. ఈ విమానాల్లో జీవితకాలం ఉచిత ప్రయాణం

Free Air tickets: ఒలింపిక్ విజేతలకు బంపర్ ఆఫర్.. ఈ విమానాల్లో జీవితకాలం ఉచిత ప్రయాణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Olympic Winners: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక గోల్డ్ మెడల్ అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ఏడాది పాటు ఉచితంగా విమాన టికెట్లు ఇస్తామని ఇది వరకే ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది.

  టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన భారత క్రీడాకారులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వాలు కోట్ల రూపాయల నగదు బహుమతులను ప్రకటిస్తున్నాయి. ఇళ్ల స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. అంతేకాదు ప్రైవేట్ సంస్థలు సైతం నజరానా అందజేస్తున్నాయి. తాజాగా పలు దేశీయ విమాన సంస్థలు ఒలింపిక్ విజేతలకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించాయి. టోక్యోలో మెడల్స్ గెలిచిన క్రీడాకారులకు ఉచిత విమాన టికెట్లు ఇస్తామని స్టార్ ఎయిర్, గో ఫస్ట్ విమాన సంస్థలు తెలిపాయి. వారికి జీవితకాలమంతా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని స్టార్ ఎయిర్ వెల్లడించగా.. ఐదేళ్ల పాటు ఈ ఉచిత టికెట్ ఆఫర్ ఉంటుందని గో ఫస్ట్ పేర్కొంది. ఇక ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక గోల్డ్ మెడల్ అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకు ఏడాది పాటు ఉచితంగా విమాన టికెట్లు ఇస్తామని ఇది వరకే ఇండిగో విమాన సంస్థ వెల్లడించింది.

  టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఏకైక భారతీయుడు నీరజ్ చోప్రాపై కాసుల వర్షం కురుస్తోంది. హరియాణా ప్రభుత్వం ఏకంగా రూ. ఆరు కోట్ల రూపాయలను ప్రకటించింది. బీసీసీఐ తరపున మరో కోటి రూపాయలు అందుతాయి. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా కోటి ప్రకటించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్ర.. నీరజ్ చోప్రాకు మహింద్రా ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

  టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు వచ్చాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా, మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకాలను గెలిచారు. ఇక మహిళ బాక్సింగ్‌లో లవ్లీనా, పురుషుల రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పునియా, మహిళ బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధు, పురుషులు హాకీ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఏడు పతకాలను సాధించింది భారత్. గతంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఆరు పతకాలలు వచ్చాయి. అందులో రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక ఈసారి హైలైట్ మాత్రం.. నీరజ్ చోప్రాకు స్వర్ణం రావడమే. వందేళ్ల చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు అందిన తొలి పతకం ఇది. అంతేకాదు 13 ఏళ్ల తర్వాత భారత్‌కు స్వర్ణ పతకం వచ్చింది.

  ఇవి కూడా చదవండి:

  Tokyo Olympics: చరిత్రలో ఇండియాకు ఇవే బెస్ట్ ఒలింపిక్స్.. రికార్డులు ఏంటో ఒకసారి చూడండి

  Tokyo Olympics: నీరజ్​కు చెన్నై సూపర్​ కింగ్స్ రూ. కోటి నజరానా.. ప్రత్యేక జెర్సీ

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Olympics, Sports, Tokyo, Tokyo Olympics

  ఉత్తమ కథలు