news18-telugu
Updated: January 13, 2021, 9:22 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 83 తేజస్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. ఇవి బరువు తక్కువగా ఉండే యుద్ధ విమానాలు. వీటికి కొనుగోలు చేయడానికి రూ.48,000 కోట్లు ఖర్చవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతపై నియమించిన కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ తేజస్ విమానాలను హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయనుంది. మిలటరీ, ఏవియేషన్ సెక్టార్లో ఇది అతి పెద్ద డీల్ అని నిపుణులు చెబుతున్నారు. మార్క్ 1A వెర్షన్ బరువు తక్కువ యుద్ధ విమానాలకు 10 నెలల క్రితం డిఫెన్స్ కౌన్సిల్ అనుమతి ఇచ్చింది. ఈ డీల్‌తో ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలో మరింత ఆయుధ సంపత్తి చేరుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తక్కువ బరువు ఉండే తేజస్ యుద్ధవిమానాలు ఎయిర్‌ఫోర్స్‌కు వెన్నెముకగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ రకం విమానాలు 50 శాతం ఉన్నాయి. కొత్త డీల్‌తో అది 60 శాతానికి పెరుగుతుంది.
హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ ఇప్పటికే తమ నాసిక్, బెంగళూరు డివిజన్లలో ఉత్పత్తికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. గతంలో 40 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తాజాగా 83 తేజస్ యుద్ధవిమానాలు దీనికి అదనం. ఈ విమానాలు ఏడేళ్లలో భారత్ ఎయిర్‌ఫోర్స్‌లో జాయిన్ అవుతాయి. వచ్చే నెలలో జరగబోయే ఏరో ఇండియా డిఫెన్స్ ఎక్స్‌పోలో దీనికి సంబంధించిన ఒప్పందం అధికారికంగా జరగనుంది.
మార్క్ 1A విమానాలు మొట్టమొదటి మోడల్ నుంచి ఇప్పటి వరకు 43 సార్లు అప్ డేట్ అయ్యాయి. అందులో చాలా ముఖ్యమైన మార్పులు చేర్పులు కూడా చోటుచేసుకున్నాయి. మెయింటెనెన్స్, రాడార్‌ను ఎలక్ట్రానిక్‌గా స్కాన్ చేయడం, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, కంటికి కనిపించనంత దూరాన్ని మిసైల్‌తో ఛేదించడం లాంటి సామర్థ్యాలు కూడా అప్ డేట్ అయ్యాయి. అందులో భారత్ తయారు చేసిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్త్ర మార్క్ 1 కూడా ఉంది. మిసైల్‌ను ఎక్కువ దూరం తీసుకుని వెళ్లగల సామర్థ్యం కూడా దానికి ఉంది.వాస్తవానికి 2018 సంవత్సరంలో 114 యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఇందులో బోయింగ్, లోక్‌హీడ్, మార్టిన్, సాబ్ ఏబీ లాంటి కంపెనీలు పాల్గొన్నాయి. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని తీసుకుంది. ఈ క్రమంలో రక్షణ రంగంలో ఆయుధ సంపత్తిని వీలున్నంత వరకు స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలని, స్వదేశీ ఆయుధాలను కొనుగోలు చేయడానికే మొగ్గుచూపాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే తేజస్ యుద్ధవిమానాలను హిందుస్తాన్ ఏరోనాటికల్స్ నుంచి కొనడానికి నిర్ణయించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 13, 2021, 9:06 PM IST