ఇండియాలో 2 వారాలుగా కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్త కేసులు 1,134 నమోదయ్యాయి. (ఇవి మంగళవారం రోజంతా నమోదైన కేసులు). ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల మార్క్ (7,026) దాటింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా తన కరోనా బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.02 శాతంగా ఉంది. ఇది చాలా తక్కువే అయినప్పటికీ.. కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివ్ కేసుల రేటు 1.09 శాతంగా ఉంది. అదే సమయంలో వారపు పాజిటివిటీ రేటు 0.98 శాతంగా ఉంది.
ఇండియాలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,98,118) దాటింది. మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. నిన్న కరోనాతో ఐదుగురు చనిపోయారు. నిన్న ఛత్తీస్‌గఢ్ , ఢిల్లీ , గుజరాత్ , మహారాష్ట్ర , కేరళలో ఒక్కొక్కరు చనిపోయారు.
ఇండియాలో ఇప్పటివరకూ కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,41,60,279గా ఉండగా... రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. ఇప్పటివరకూ ఇండియాలో 92.05 కోట్ల టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 1,03,831 టెస్టులు చేశారు. ఆరోగ్య శాఖ వెబ్‌సైట్ ప్రకారం... ఇప్పటివరకూ కేంద్రం 220.65 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేసింది.
సడెన్‌గా కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే.. వాతావరణం మారడం వల్ల అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇండియాలో చాలా మంది బూస్టర్ డోస్ తీసుకోలేదనీ.. అందువల్లే పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనాతోపాటూ.. రకరకాల వైరస్‌లు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలపై దండయాత్ర చేస్తూ... జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి వంటివి రప్పిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.