భారత్‌లో శనివారం 843 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 4 నెలల్లో... ఒక్క రోజులో ఇంత ఎక్కువగా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీనిపై మనం అప్పుడే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే 140 కోట్ల మంది జనాభాలో 800 కేసులంటే.. చాలా చాలా తక్కువే. కాకపోతే.. రెండు వారాల కిందటి వరకూ రోజూ 500 దాకా కొత్త కేసులు వచ్చాయి. అవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇదే కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. రెండేసి, మూడేసి డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటం హాట్ టాపిక్ అయ్యింది.
ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,389 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కరోనాతో నలుగురు చనిపోవడంతో.. ఇండియాలో మొత్తం మరణాల సంఖ్య 5,30,799కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్ల (4,46,94,349)కు చేరింది. తాజా మరణాల్లో జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చనిపోగా.. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలోని మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.01 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది.
కరోనా కట్టడికి... ప్రస్తుతం మహారాష్ట్ర , గుజరాత్ , తెలంగాణ , తమిళనాడు , కేరళ , కర్ణాటకలో.. 5 అంచెల వ్యూహం అమలు చేస్తున్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ల విధానం ఇందులో ఉంది.
ఇండియాలో కొత్త కరోనా వేరియంట్ XBB.1.16 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా 76 శాంపిల్స్‌లో ఈ వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఇండియాలో ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఈ వేరియంటే కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి 126 రోజుల తర్వాత మళ్లీ ఇండియాలో 800కి పైగా కరోనా కేసులు వచ్చాయి. వాటిని చూసి ఇప్పుడు మనం హడావుడిగా మాస్కులు వాడేయాల్సిన పని లేకపోయినా... కరోనా పూర్తిగా పోలేదు అనే సంకేతం మాత్రం ఇస్తున్నాయి ఈ కేసులు. జాగ్రత్త పడుతూ... కరోనాపై ఓ కన్నేసి ఉంచుకుంటే మంచిదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Coronavirus, India