భారత దేశం ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ప్రతి ఏటా ఒక విదేశీ ప్రముఖుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంది ఇండియా. ఈ సారి గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారో తెలుసా. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్. 2021 జనవరి 26న జరగబోయే రిపబ్లిక్ డే ఉత్సవానికి హాజరుకావాల్సిందిగా బోరిస్ జాన్సన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెలలో ఆహ్వానించారు. నవంబర్ 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ పీఎంకు ఫోన్ చేసి సాదరంగా ఆహ్వానించినట్టు తెలిసింది. అదే సమయంలో వచ్చే ఏడాది యూకేలో జరగబోయే జీ7 సమ్మిట్‌కు హాజరుకావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూకే పీఎం బోరిస్ జాన్సన్ కూడా సాదరంగా ఆహ్వానించినట్టు తెలిసింది. అయితే, ప్రధానమంత్రి మోదీ పిలుపునకు సంబంధించి ఇంకా బోరిస్ జాన్సన్ తరఫునుంచి స్పందన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రధాని మోదీ విజ్ఞప్తికి స్పందించి యూకే ప్రధాని భారత్‌కు వస్తే 27 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరైన బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ నిలుస్తారు. గతంలో 1993లో అప్పటి యూకే ప్రధాని జాన్ మేయర్ జనవరి 26న ఇండియాకు వచ్చారు.
దీనిపై భారత్‌లో బ్రిటిష్ హై కమిషనర్ స్పందించాల్సి ఉంది. ‘మేం అప్పుడే కచ్చితంగా చెప్పలేం. ప్రధాని బోరిస్ జాన్సర్ భారత పర్యటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.’ అని బ్రిటిష్ హైకమిషన్ అధికార ప్రతినిధి తెలిపినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.