దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది హెల్త్ వర్కర్లకు, పారిశుధ్య కార్మికులకు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను ఇస్తున్నారు. మొదటి విడతగా కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ధైర్యంగా సహాయ కార్యక్రమాలు అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను అందివ్వాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసింది. రానున్న రోజుల్లో సామాన్య ప్రజలకు కూడా కరోనా వ్యాక్సిన్ ను అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇతర దేశాలకు కూడా భారత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల విన్నపం మేరకు, అందుబాటులో ఉన్న డోసుల సంఖ్యను బట్టి ఇతర దేశాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ అందిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేసే విషయమై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్ వంటి దేశాలకు భారత్ ఇప్పటికే కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను సరఫరా చేసింది. ఆయా దేశాల విన్నపం మేరకు లక్షల డోసులను ప్రత్యేక విమానాల్లో పంపించింది. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలకు కూడా వ్యాక్సిన్ ను సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ ను అందించి ఆపన్నహస్తం ఇస్తున్న భారత్, పక్కనే ఉన్న పాకిస్తాన్ కు వ్యాక్సిన్ ను సరఫరా చేస్తుందా చేయదా..? అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేశారు. దీనికి భారత్ స్పందించింది.
’కరోనా వ్యాక్సిన్ కావాలని, తమకు సరఫరా చేయాలని పాకిస్తాన్ నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి విన్నపం రాలేదు. అందుకే పక్కనే ఉన్న ఇన్ని దేశాలకు ఇప్పటికే సరఫరా చేశాము కానీ, పాక్ కు కొవిడ్ వ్యాక్సిన్ ను ఇంకా పంపించలేదు. పాక్ కనుక కోరితే వ్యాక్సిన్ ను పంపించకుండా ఉండదు. తప్పకుండా పాక్ విన్నపాన్ని భారత్ అన్నిదేశాలతో సమానంగా పరిగణిస్తుంది. పరిశీలిస్తుంది.‘ అని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కు ఐదు లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిస్తామని చైనా ఇప్పటికే ప్రకటించింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తోంది.
Published by:Hasaan Kandula
First published:January 23, 2021, 14:27 IST