G20 Presidency : భారతదేశానికి చరిత్రాత్మక అవకాశం దక్కింది. సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్న G20 కూటమికి ఇండియా నేతృత్వం వహిస్తోంది. డిసెంబర్ 1,2022న ఇండియా G20 ప్రెసిడెన్సీ స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్తాపత్రికలకు రాసిన ఒక కథనంలో.. ‘వసుధైవ కుటుంబం' గురించి ప్రస్తావించారు. ఒకే ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు గా ఎదగాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, మహమ్మారి ప్రపంచ మానవాళి ఎదుర్కోవాల్సిన సవాళ్లని పేర్కొన్నారు. మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ(Human Centric Globalisation)కు కొత్త నమూనాను రూపొందించడానికి ఫండమెంటల్ మైండ్‌సెట్ షిఫ్ట్ అవసరమని సూచించారు. అదే పాత జీరో-సమ్ మైండ్‌సెట్‌లో చిక్కుకునే సమయం పోయిందని, ఈ విధానం కొరత, సంఘర్షణ రెండింటికీ దారితీసిందని ప్రధాని అన్నారు.
ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి ప్రేరణ
ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఏకత్వాన్ని సమర్థించే, కలిసి పని చేసే మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందాల్సిన సమయమని మోదీ చెప్పారు. భారతదేశం G20 ప్రాధాన్యతలు కేవలం G20 భాగస్వాములకే పరిమితం చేయమని అన్నారు. గ్లోబల్ సౌత్ - ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలోని దేశాలను కూడా సంప్రదించి తదనుగుణంగా రూపొందిస్తామని చెప్పారు. భారతదేశం G20 ప్రెసిడెన్సీని హీలింగ్, హార్మనీ, హోప్ ప్రెసిడెన్సీగా మార్చడానికి కలిసి పని చేయాలని సూచించారు. మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణ కొత్త నమూనాను రూపొందిద్దామని పిలుపునిచ్చారు. సుస్థిరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆహారం, ఎరువులు, వైద్య ఉత్పత్తుల ప్రపంచ సరఫరాను ఇతర అంశాలతో పాటు రాజకీయం లేకుండా చేయడం కోసం దేశం ఎదురుచూస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు మా నినాదం
దురదృష్టవశాత్తూ, ఈనాటికీ మనం అదే జీరో-సమ్ మైండ్‌సెట్‌లో చిక్కుకున్నామని తెలిపారు. భూభాగం లేదా వనరులపై దేశాలు పోరాటాలు చేయడం చూస్తున్నామని మోదీ అన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాను ఆయుధాలుగా ఉపయోగించుకోవడం కూడా చూస్తున్నామని చెప్పారు. కోట్ల మంది దుర్భలంగా ఉన్నప్పుడు, కొందరి వద్దే వ్యాక్సిన్ నిల్వలు ఉండటం చూశామని చెప్పారు. మానవులు స్వాభావికంగా స్వార్థపరులైతే, మనందరి ప్రాథమిక ఏకత్వాన్ని సమర్థించే అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు ఏం వివరిస్తున్నాయి? అని ప్రశ్నించారు.
భారతదేశంలో ప్రసిద్ది చెందిన అటువంటి సంప్రదాయం, అన్ని జీవులను, నిర్జీవ వస్తువులను కూడా ఐదు ప్రాథమిక అంశాలతో కూడినదిగా చూస్తోందన్నారు. భూమి, నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం పంచ తత్వాలు సామరస్యం, భౌతిక, సామాజిక, పర్యావరణ శ్రేయస్సుకు చాలా అవసరమని చెప్పారు. భారతదేశం G20 ప్రెసిడెన్సీ ఈ సార్వత్రిక ఏకత్వ భావనను ప్రోత్సహించడానికి పని చేస్తుందని స్పష్టం చేస్తారు. అందుకే ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు నినాదాన్ని ఎంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లాంచ్
ఈరోజు యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రామ్‌తో ఇండియా G20 ప్రెసిడెన్సీని స్వీకరించింది. యూనివర్సిటీ కనెక్ట్ కార్యక్రమం ద్వారా భారతదేశం అంతటా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు G20 శిఖరాగ్ర సమావేశం, దాని అధ్యక్షత, భారతదేశం ప్రపంచానికి ఒక రోల్ మోడల్‌గా ఎలా ఉద్భవించగలదనే దానిపై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రి S జైశంకర్, ప్రభుత్వ ఉన్నతాధికారులు 75 మంది వర్సిటీ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. దేశం ప్రయాణంలో వాటర్‌షెడ్ మూమెంట్ గురించి అవగాహన కల్పించారు. న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. G20 యూనివర్సిటీ కనెక్ట్ ఈవెంట్‌కు UGC ఛైర్మన్ M.జగదీష్ కుమార్, G20 సమ్మిట్ సన్నాహక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అమితాబ్ కాంత్, G20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా కూడా హాజరయ్యారు.
IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో మొదలైన ప్లేస్‌మెంట్స్.. 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ప్యాకేజీ..!
నాగాలాండ్, కోహిమాలోని అందమైన కొండల మధ్య కిసామాలోని నాగా హెరిటేజ్ విలేజ్‌లో డిసెంబర్ 1 నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీతం, మరిన్ని ఆకర్షణలతో పది రోజుల హార్న్‌బిల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. G20 అధ్యక్ష పదవిని భారతదేశం స్వీకరించిన సందర్భానికి ఈ పండుగ మొదటి వేదికగా మారింది. గురువారం నాగాలాండ్ 60వ రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో ఉత్సవాలను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రారంభించారు. కొన్ని UNESCO వారసత్వ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా 100 స్మారక చిహ్నాల వద్ద G20 లోగోను ప్రదర్శించారు. అక్కడ ప్రజలను సెల్ఫీలు దిగి MyGovలో వెబ్సైట్లో పోస్ట్ చేయమని పిలుపునిచ్చారు. సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఇసుకతో భారతదేశం G20 లోగో రూపొందించారు.
ఇండియాకు మరిన్ని కీలక బాధ్యతలు
గురువారం భారతదేశం డిసెంబర్ నెలకు UN భద్రతా మండలి అధ్యక్ష పదవిని చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, రీఫార్మడ్ మల్టిలేటరలిస్మ్పై ఈవెంట్లను నిర్వహిస్తుంది.ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన 26వ వార్షిక ప్లీనరీలో బహుపాక్షిక ఎగుమతి నియంత్రణ పాలన అయిన వాస్సేనార్ అరేంజ్మెంట్ ఛైర్మన్‌గా కూడా ఇండియా బాధ్యతలు స్వీకరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.