news18-telugu
Updated: August 14, 2020, 10:12 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమయ్యింది. కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. భౌతిక దూరం వంటి కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎర్రకోట వద్ద శనివారం ఉదయం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొననున్నారు. కరోనా కారణంగా ఈ సారి విద్యార్థులు ఎర్రకోట వద్ద నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు పాల్గొనడంలేదు. ఎర్రకోట వద్ద కొద్ది మంది అతిథుల కోసం భౌతిక దూరంతో కుర్చీలు ఏర్పాటు చేశారు. పలు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులతో పాటు కరోనాను జయించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులను వేడుకలకు ఆహ్వానించారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడ జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలకు దాదాపు 30 వేల మంది పాల్గొనేవారు.
ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులు అందరూ విధిగా మాస్కులు ధరించాలని ఇప్పటికే కోరారు. ఏదైనా కారణంతో మాస్క్‌లు తీసుకురాలేని పక్షంలో...వారికి అందజేసేందుకు మాస్క్‌లను కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. అలాగే శానిటైటర్లను కూడా అందుబాటులో ఉంచుతారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం 7.21 గం.లకు ఎర్రకోటకు చేరుకుని 7.30 గం.లకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. కాగా గల్వాన్ లోయలో అమరులైన భారత అమరజవాన్ల త్యాగాలను ప్రధాని మోదీ తన ప్రసంగంలో మరోసారి గుర్తుచేయనున్నారు. చైనా సామ్రాజ్యవాద విస్తరణ అజెండాను ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ మరోసారి తూర్పారబట్టే అవకాశముంది. అలాగే కరోనాపై పోరాటంలో ఫ్రంట్ లైన్ కరోనా యోధుల సేవలను ప్రధాని మోదీ కొనియాడనున్నారు. దేశంలో నెలకొన్న కరోనా ఉధృతి, ఆత్మ నిర్భర్ భారత్ తదితర అంశాలను ప్రధాని తన ప్రసంగంలో హైలైట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Published by:
Janardhan V
First published:
August 14, 2020, 10:12 PM IST