ప్రతి ఏడాది ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అద్భుతమైన ఘట్టాన్ని పురస్కరించుకొని జెండా పండగ జరుపుకుంటాం. బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందిన రోజుగా సెలబ్రేట్ చేసుకుంటాం. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్ర కోటపై ఆగస్టు 15న రోజున మువ్వన్నెల జెండాను ఎగరేశారు. అప్పటి నుంచి ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్ర కోటపై జెండా ఎగరేయడం ఆనవాయితీగా మారింది. అయితే ప్రస్తుత జెండా పండగ 74వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేదా 75వదా? అని చాలామంది తికమక పడుతుంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. కానీ 1947 నుంచి లెక్కిస్తే ప్రస్తుతానికి 74 సంవత్సరాలు మాత్రమే పూర్తవుతాయని కొందరు వాదిస్తున్నారు. అసలు దీనికి సమాధానం ఏంటంటే..
1947ని బేస్ ఈయర్‌గా ఎంచుకొని లెక్కిస్తే ..2021 వరకు 74 సంవత్సరాలు అవుతాయి. అయితే 1947 ఆగస్టు 15ని మొదటి స్వాతంత్య్ర దినోత్సవంగా లెక్కిస్తే ప్రస్తుతం జరుపుకునేది 75వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. ఈ ఏడాది కూడా పద్ధతిని పాటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయనున్నారు. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనం కూడా స్వీకరిస్తారు.
ఈ సంవత్సరం కరోనా కారణంగా ఎక్కువ మందిని ఈ ఉత్సవాలకు ఆహ్వానించలేదు. అయితే తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. వారు సాధించిన ఆ పతకాలను చూపుతూ దేశ గౌరవాన్ని పెంచారు. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారినే ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది ప్రభుత్వం. ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో ఈ సారి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు దిల్లీ పూర్తిగా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ట్రాఫిక్ నియమాలను కూడా అమలు చేయనున్నారు. సాధారణ ప్రజల కోసం అక్కడి ట్రాఫిక్ విభాగం, పోలీసులు జాగ్రత్త చర్యలను విడుదల చేశారు. ఎర్ర కోట వద్ద సెక్యూరిటీని బలోపేతం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.