కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులను సమర్థిస్తూ కర్ణాటక సీఎం కుమారస్వామి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సహజంగా రాష్ట్రంలో ఎలాంటి ఐటీ దాడులు జరిగినా...ఇది రాజకీయ ప్రేరేపితమంటూ జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించేవారు. అయితే కన్నడ సినీ తారలు శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యష్, నిర్మాతలు సీఆర్ మనోహర్, రాక్‌లైన్ వెంకటేశ్, విజయ్ కిరిగండూర్ తదితరులు ఇళ్లపై జరిగిన ఐటీ దాడులను సమర్థిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కన్నడ సినీ తారల ఇళ్లలో వరుసగా మూడో రోజు శనివారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి.
సినీ తారల ఇళ్లపై ఐటీ దాడులను రాజకీయ ప్రేరేపితమైనవిగా పరిగణించడానికి వీల్లేదని హుబ్లీలో మీడియాతో మాట్లాడిన హెచ్డీ కుమారస్వామి అన్నారు. సినీ తారలు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ శాఖ నిర్థారించిన తర్వాతే...ఐటీ దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ శాఖ అధికారులు వారి విధులను నిర్వర్తిస్తున్నారంటూ వెనకేసుకొచ్చారు కుమారస్వామి. పన్ను ఎగవేతకు పాల్పడినట్లు నిర్థారణ అయిన తర్వాత ఐటీ శాఖ అధికారులు చేయగలిగింది ఇదే కదా అని వ్యాఖ్యానించారు.
పన్నుల చెల్లింపు విషయంలో సినీ తారలు ‘ప్రత్యేకం’ కాదని, వారు కూడా చట్టానికి కట్టుబడి ఉండాలని కుమారస్వామి హితవుపలికారు. సినీ తారల ఇళ్లపై మూడ్రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులు ఎప్పుడు ఆపుతారో తెలీదని ఐటీ వర్గాలు తెలిపాయని కుమారస్వామి వెల్లడించారు. ఐటీ శాఖ ఇలాంటి దాడులు చేయడం ద్వారా చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ సంస్థలకు కూడా మేలు జరుగుతుందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.