భారత సాయుధ బలగాల చరిత్రలో తీవ్ర విషాద ఘటనగా భావిస్తోన్న ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ వేగవంతమైంది. తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో బుధవారం నాడు ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోగా, అందులో ప్రయాణిస్తోన్న 14 మందితో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, 13 మందీ దుర్మణం చెందిన సంగతి తెలిసిందే. అయితే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో వాటిని గుర్తించడం కష్టతరమైంది. అక్కడ లభించిన శరీర భాగాల డీఎన్ఏలను కుటుంబీకుల డీఎన్ఏలతో పోల్చి పాజిటివ్ గా గుర్తించిన వాటిని అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం నాటికి సీడీఎస్ బిపిన్ రావత్ తోపాటు ముగ్గురి పార్థివదేహాలను గుర్తించగా, శనివారం ఉదయం నాటికి మరో ఆరుగురి దేహాలను గుర్తించారు. అందులో తెలుగు జవాన్ సాయితేజ పార్థివదేహం కూడా ఉంది..
తమిళనాడులో జరిగిన ఐఏఎఫ్ హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోయిన 13 మందిలో ఇప్పటికే ముగ్గురు (సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, సీడీఎస్ సలహాదారైన బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడర్) పార్ధివదేహాలను గుర్తించి, కుటుంబీకులకు అప్పగించగా శుక్రవారం నాడే ఢిల్లీలో అత్యక్రియలు పూర్తయ్యాయి. చనిపోయినవారిలో మరో 6గురి మృతదేహాలను శనివారం నాటికి గుర్తించారు. అందులో నలుగురు ఎయిర్ ఫోర్స్, ఇద్దరు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
లాన్స్ నాయక్ బి.సాయితేజ సీడీఎస్ బిపిన్ రావత్ కు సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తూ ప్రమాదంలో దుర్మణం చెందడం తెలిసిందే. శనివారం నాడు గుర్తించిన మృతదేహాల్లో సాయితేజతోపాటు మరో లాన్స్ లాయక్ వివేక్ కుమార్, ఎయిర్ ఫోర్స్ కు చెందిన జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్ అరక్కల్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ భౌతికకాయాలున్నాయి. సాయితేజ, వివేక్ కుమార్ ల భౌతికకాయలను సొంత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆరుగురి భౌతికకాయాలను సొంత ప్రాంతాలకు పంపడానికి ముందు ఢిల్లీ కంటోన్మెంట్ లోని బేస్ హాస్పిటల్ వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులు అర్పిస్తారు. ఎయిర్ ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్లలోనే భౌతికకాయాలను సొంత ప్రాంతాలకు పంపుతారు. సైనిక లాంఛనాలతోనే అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ‘చనిపోయిన జవాన్ల కుటుంబీకుల మానసిక పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. అందుకే పార్థివదేహాల గుర్తింపు ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నాం. అయితే ఇది సున్నితమైన పని కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్త వహిస్తున్నాం’ అని అధికారులు చెప్పారు.
జవాన్ సాయితేజ భౌతికకాయాన్ని ముందుగా బెంగళూరు తరలించి, అక్కడి నుంచి శనివారం మధ్యాహ్నానికే స్వస్థలం చిత్తూరు జిల్లా కురబాలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి తీసుకురానున్నారు. సాయుతే జ మరణం తర్వాత ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబీకుల డీఎన్ఏతో సరిపోల్చి సాయితేజ శరీర భాగాలను గుర్తించారు. కాగా, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడర్ పార్థివదేహాలకు శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bipin Rawat, Helicopter Crash, Sai teja