హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nagrota Encounter: నగ్రోటా ఎన్ కౌంటర్.. ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

Nagrota Encounter: నగ్రోటా ఎన్ కౌంటర్.. ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం

ఆర్మీ యుద్ధ ట్యాంక్‌పై భారత ప్రధాని (File)

ఆర్మీ యుద్ధ ట్యాంక్‌పై భారత ప్రధాని (File)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ వర్గాల అధినేతలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు.

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ వర్గాల అధినేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ముంబైలో దాడులు జరిగిన నవంబర్ 26వ తేదీనే మరోసారి భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది. నలుగురు టెర్రరిస్టులను హతమార్చింది. వారంతా ముంబై దాడులు జరిగిన రోజే మరోసారి భారీ స్థాయిలో దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు నిఘావర్గాలకు తెలిసింది. ఈ క్రమంలో దేశంలో భద్రతపై ప్రధాని మోదీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలను ప్రధానిమోదీ అభినందించారు.

  జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బాన్‌ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రక్కు డ్రైవర్‌ వెంటనే దిగి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు ట్రక్కులో వెతికాయి. బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. భారీగా మందులు, పేలుడు సామగ్రి, వైర్ల బండిళ్లు, ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు లభ్యమయ్యాయి.

  మరోవైపు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, పాకిస్తాన్‌కు చెందిన జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు ఉగ్రదాడుల్లో అతడు దోషిగా తేలినట్టు స్థానిక యాంటీ టెర్రరిజం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హఫీజ్‌ను అరెస్టు చేయాలని అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం గత ఏడాది జూలైలో అతడిని అరెస్టు చేసింది. ​కట్టుదిట్టమైన భద్రత మధ్య హఫీజ్‌ సయీద్‌ పాక్‌లోని కోట్‌ లాక్‌పాత్ జైలులో ఉన్నాడు. జమాత్‌-ఉల్‌-దవా ప్రతినిధులపై పాకిస్తాన్‌ ఉగ్ర వ్యతిరేక సంస్థ ఇప్పటి వరకు 41కేసులు నమోదు చేసింది. 4 కేసుల్లో హఫీజ్‌ సయీద్‌ దోషిగా తేలగా మిగతావి పాక్‌లోని పలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.  2008 నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై తాజ్ హోటల్, మరికొన్ని ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో 166 మంది చనిపోయారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Encounter, Jammu and Kashmir, Pm modi, Terrorists

  ఉత్తమ కథలు