కరోనా సమయంలో వివిధ రంగాల కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే ప్రస్తుతం చాలా కంపెనీలు పాత విధానంలోనే పనిచేస్తున్నాయి. కానీ ఉద్యోగులు మాత్రం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కావాలని కోరుతున్నారు. దీనిపై నిర్వహించిన తాజా సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 91.47 శాతం మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి రిమోట్ వర్క్‌ను నిరవధికంగా అందించే కంపెనీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని బ్రిడ్జ్‌ల్యాబ్జ్ (BridgeLabz) సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 48.81 శాతం మంది రిమోట్‌గా పని చేయడానికి ఇష్టపడుతుండగా, 27.78 శాతం మంది హైబ్రిడ్ మోడల్‌ను ఇష్టపడుతున్నారని తేలింది.
ఈ సర్వేలో 1000 మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారు. వీరిలో 49.60 శాతం మంది టైర్ 1, 2, 3 నగరాల నుంచి రిమోట్‌గా పని చేస్తున్నారు. రిమోట్‌గా పని చేయడం వల్ల తమ ప్రొడక్టివిటీ లెవల్స్ మారలేదని 51.59 శాతం మంది అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొనేవారిలో మొత్తం 31.13 శాతం మంది రిమోట్ వర్క్‌ను కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, కొత్త నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగించారు. అయితే 23.41 శాతం మంది రిమోట్‌గా పని చేయడం వల్ల పని సామర్థ్యం పెరిగిందని భావించారు. రిమోట్‌గా పని చేయడం ద్వారా తమకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించాయని 70 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు.
సర్వే ఫలితాల గురించి బ్రిడ్జ్‌ల్యాబ్జ్ వ్యవస్థాపకులు నారాయణ్ మహదేవన్ మాట్లాడుతూ.. ‘కంపెనీలు అందరు ఉద్యోగులతో ఆఫీస్‌లు ఓపెన్ చేయాలని భావిస్తుండగా, చాలా మంది నిపుణులు రిమోట్ వర్క్‌ను ఇష్టపడుతున్నారు లేదా వెతుకుతున్నారు. జాబ్ ఆఫర్‌లను రూపొందించేటప్పుడు కంపెనీలు తప్పనిసరిగా వర్కింగ్ మోడల్ ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోవాలని ఈ రిపోర్ట్ సూచిస్తుంది. స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు మార్కెట్‌లో గట్టి పోటీ ఉంది. దీంతో కంపెనీలు వీరికోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ ప్రక్రియలో వర్కింగ్ మోడల్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది.’ అని చెప్పారు.
మరో సర్వేలో.. దాదాపు 50 శాతానికి పైగా నిపుణులు రాబోయే మూడు నెలల్లో ఉద్యోగాలు మారడానికి ఎదురుచూస్తున్నారని తేలింది. ప్రతి ఐదుగురు నిపుణులలో నలుగురు ఒకే జాబ్ ప్రొఫైల్‌లో కొనసాగాలనుకుంటున్నారని 'అప్నా భారత్ బ్యాక్ టు వర్క్' (Apna Bharat Back to Work) అనే సర్వే పేర్కొంది. అయితే మెజారిటీ మెంబర్స్ పని చేయడానికి ఇష్టపడే ప్రదేశం లేదా నగరంపై స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. అభ్యర్థులు ఒక నెలలో కనీసం ఐదు కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారని అధ్యయనం వెల్లడించింది. 50 శాతం కంటే ఎక్కువ మంది జాబ్ ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్ జాబ్ సెర్చ్ చేస్తుండగా, 22 శాతం మంది అన్ని సమయాలలో ఉద్యోగాల కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే 30 శాతం మంది ప్రతి నెలకు ఒకసారి జాబ్ సెర్చ్ చేస్తున్నారని సర్వే వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, IT Employees, Survey, Work From Home