IN A FIRST TRICOLOUR UNFURLED ATOP CLOCK TOWER AT HISTORIC LAL CHOWK IN SRINAGAR PVN
First Time In History : దేశ చరిత్రలో తొలిసారి...లాల్‌చౌక్ క్లాక్ టవర్ పై రెపరెపలాడిన త్రివర్ణపతాకం
లాల్‌చౌక్ క్లాక్ టవర్ పై త్రివర్ణపతాకం
Srinagar Lal Chowk : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రఖ్యాత లాల్‌చౌక్ ప్రాంతంలోని క్లాక్ టవర్ పై త్రివర్ణపతాకం రెపరెపలాడింది.
Srinagar Lal Chowk : నేడు దేశవ్యాప్తంగా 73వ రిపబ్లిక్ డే(Republic Dayవేడుకలను కరోనా ఆంక్షల మధ్య ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలను దేశం జరుపుకుంటుంది. సాధారణంగా ఏటా జనవరి 24వ తేదీ నుంచే గణతంత్ర వేడుకలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23వ తేదీ నుంచి దేశంలో గణతంత్ర వేడుకల శోభ కనిపించింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది.
శ్రీనగర్ లోని ప్రఖ్యాత లాల్‌చౌక్ ప్రాంతంలో ఎన్జీవోలు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్థానికులు 73వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాజిద్ యూసుఫ్ షా, సాహిల్ బషీర్ భట్ అనే ఇద్దరు స్థానికులు క్లాక్ టవర్ పై జాతీయ జెండాను ఎగురవేశారు. ఒక క్రేన్ సాయంతో క్లాక్ టవర్ పైవరకూ వెళ్లి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్‌చౌక్ క్లాక్ టవర్(Lal Chowk Clock Tower)పై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడం ఇదే మొదటిసారి.
ఈ సందర్భంగా జెండా ఎగురవేసిన వ్యక్తుల్లో ఒకరైన సాజిద్ యూసుఫ్ మాట్లాడుతూ..."స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో జాతీయ జెండా ఎగరని ప్రాంతం ఇదొక్కటే. గతంలో చాలా మంది ప్రయత్నించినప్పటికీ మేమే తొలిసారిగా సక్సెస్ అయ్యాం. లాల్ చౌక్‌లో జెండాను ఎగురవేసే అవకాశం మాకు లభించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన వారికే ఈ గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. చరిత్రలో మొదటిసారిగా మేము భారతదేశంలో ఉన్నామని భావిస్తున్నాము. భారతీయులుగా జాతీయ జెండాను ఎగురవేయడం తమకెంతో సంతోషాన్ని కలిగించదని చెప్పాడు." అని అన్నారు. జెండా ఎగురవేసిన వ్యక్తుల్లో మరొకరైన బషీర్ భట్... "చరిత్రను మార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులు ఇక్కడికి వచ్చి లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్‌పై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించేవారు. కానీ మేం ఈరోజు భారత జాతీయ జెండా ఎగురవేశాం. ఈరోజు ఇద్దరం, రేపు ఇరవై మంది, తరువాత రెండు వందల మంది వస్తారు" అని ఆయన అన్నారు.
370వ అధికరణ రద్దు తర్వాత ఇక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. నయా కశ్మీర్ అంటే ఏమిటని జనం అడుగుతున్నారు? ఇవాళ ఎగురవేసిన త్రివర్ణ పతాకమే నయా కశ్మీర్‌కు అర్ధం చెబుతుంది. ఇదే జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నది కూడా. మాకు పాకిస్థాన్ జెండాలు అక్కర్లేదు. మేము శాంతి, అభివృద్ధిని కోరుకుంటున్నాం అని జెండా ఆవిష్కరణ అనంతరం స్థానికుడు ఒకరు తెలిపారు.
శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌కు దేశంలోనే ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. 1948లో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనే పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత్ నిలువరించింది. ఆ తరువాత భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ జెండాను ఎగురవేసిన ప్రదేశం ఇది. అప్పటి వరకు ప్రత్యేక సంస్థానంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ తరువాత భారతదేశంలో కలిసి పోయింది. తరువాత చాలా సందర్భంగాల్లో ఇక్కడ జాతీయ జెండా ఎగురలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.