భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతుల ఆదాయం పెరిగేలా చేయగలవని ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అన్నారు. అయితే ఈ క్రమంలో రైతులకు సామాజిక భద్రత కూడా కల్పించాలని అభిప్రాయపడ్డారు. దేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మౌలిక వసతుల రంగం సహా పలు రంగాల్లో సంస్కరణలు అవసరమని గీతా గోపీనాథ్ అన్నారు. గత సెప్టెంబర్‌లో తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన భారత ప్రభుత్వం.. దళారీ వ్యవస్థ లేకుండా చేయడంలో ఈ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంది. కొత్త చట్టాల వల్ల రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని తెలిపింది.
కొత్త వ్యవసాయ చట్టాలపై స్పందించిన గీతా గోపీనాథ్.. ఇవన్నీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఉద్ధేశించినవని అన్నారు. రైతు ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ను ఈ చట్టాలు మరింతగా పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా మండీల బయట అనేక చోట్ల రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని అన్నారు. ఈ రకంగా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అన్నారు. సంస్కరణలు తీసుకొచ్చిన ప్రతిసారి కొన్ని ఇబ్బందులు వస్తాయని అన్నారు. అయితే రైతులకు ఈ చట్టాల వల్ల ఎలాంటి హానీ కలుగకుండా చూడాలని అన్నారు. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గతేడాది నవంబర్ 28 నుంచి వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా, దక్షిణ ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడంతోపాటు పంటలకు కనీస మద్దతు ధర కల్పించే అంశానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగినా.. ఎవరూ ఈ విషయంలో తమ పట్టువీడకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు.
అయితే రైతులతో జరిపిన చివర దఫా చర్చల్లో ఈ కొత్త చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు నిలిపేస్తామని కేంద్రం సూచించింది. ఓ జాయింట్ కమిటీ వేసి సమస్యకు పరిష్కారాలు వెతుకుదామని పేర్కొంది. ఆందోళన చేస్తున్న రైతులు వెంటనే తిరిగి ఇళ్లకు వెళ్లాలని కోరింది. అయితే ఈ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తాము ఆందోళన విరమించబోమని రైతుల స్పష్టం చేస్తున్నారు.
41 రైతు సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా.. ఈ ఆందోళనలకు సారథ్యం వహిస్తోంది. మంగళవారం గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ తీస్తామన్న రైతు సంఘాలు.. ఢిల్లీ నగరంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాయి. వేలాదిమంది రైతులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఎర్రకోటపై జెండా ఎగరేశారు.
మరోవైపు నిన్న జరిగిన ఆందోళనలు కిసాన్ మోర్చా ఖండించింది. తమ ఆందోళనలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని.. లేదంటే తమ ఆందోళనలు ప్రశాంతంగా జరిగేవని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.