అధినేత్రి సోనియా గంధీనే ఎదిరించారు.. ఆమె నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఏకంగా బహిరంగ లేఖ రాశారు.. గాంధీ-నెహ్రూ పరివారంపై దాదాపు తిరుగుబాటు చేసి జీ-23గా నిలిచారు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆ అసమ్మతి బృందానికి నాయకుడిగా గులాం నబీ ఆజాద్ నిలిచారు.. ప్రధాని నరేంద్ర మోదీతో ఆజాద్ కు ఉన్న అనుబంధం, జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతోన్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేసి కొత్త పార్టీ పెడతాననే సంకేతాలూ ఇచ్చారు.. కాంగ్రెస్ లో ఇందిర-రాజీవ్ కాలం నాటి స్ఫూర్తి లేదని, ఇప్పుటి హైకమాండ్ విమర్శను తట్టుకోలేకపోతున్నదనీ ఎద్దేవా చేశారు.. సీన్ కట్ చేస్తే.. అసలు పార్టీలో ఎలాంటి విభేదాలు, హైకమాండ్ తో గొడవలు లేనేలేవన్నారు గులాం నబీ ఆజాద్. తనను తాను 24 క్యారెట్ల స్వచ్ఛమైన కాంగ్రెస్‌వాదిగా చెప్పుకున్నారు.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరోసారి హెడ్ లైన్లలో నిలిచారు. ఆర్టికల్ 370 తొలగింపు సమయంలో చెప్పినట్లుగానే కేంద్రం.. జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాల్లో ఉండగా, రాష్ట్రంలో ఆజాద్ కొత్త పార్టీ పెడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక దశలో తాను కూడా సిద్ధమేనన్నట్లు కామెంట్లు చేసిన ఆజాద్.. ఇప్పుడు అసలైన మాటగా క్లారిటీ ఇచ్చారు. అక్నూర్(జమ్మూకాశ్మీర్)లో ఆదివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు తాను 24 క్యారెట్ల కాంగ్రెస్ వాదినని కితాబిచ్చుకున్నారు.
‘నేను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాననేది వాస్తవం కాదు. కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదాలున్న మాట కూడా నిజం కాదు. అయితే, పార్టీలో ప్రక్షాళన, మార్పు అవసరమా అంటే మాత్రం తప్పక అవుననే చెబుతాను. కాంగ్రెస్ లోనే కాదు, ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత సంస్కరణలు చాలా అవసరం కూడా. మార్పు కోరినంత మాత్రాన నేను కాంగ్రెస్ వాడిని కాకపోతానా? 24 క్యారెట్ల స్వచ్చమైన కాంగ్రెస్ వాదిని నేను’అని గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సొంతగా 300 సీట్లు గెలుచుకునే సీన్ కనిపించడంలేదని కుండబద్దలు కొట్టిన 48 గంటల్లోనే గులాం నబీ ఆజాద్ తనకు పార్టీతో విభేదాల్లేవని క్లారిటీ ఇచ్చుకోవడం గమనార్హం. కాగా, జమ్మూకాశ్మీర్ జనంతో బీజేపీ ప్రమాదకరమైన ఆటలాడుతోందని, అప్పటి రాజుల పాలనే నయం అనిపించేంత దుర్మార్గంగా ఇప్పటి బీజేపీ పాలన ఉందని ఆజాద్ ఆరోపించారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య సంప్రదాయంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగే ప్రభుత్వ కార్యాలయాల మార్పును అధికారులు నిలిపేయడం పట్ల ఆజాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Ghulam Nabi Azad, Jammu kashmir