Kangaroos In India : ఆస్ట్రేలియాలో కనిపించే కంగారూలు ఇటీవల పశ్చిమబెంగాల్ లో కనిపించిన విషయం తెలిసిందే. జల్ పాయ్ గురి,సిలిగురి ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం రోడ్లపై కంగారూలు తిరుగుతూ కనిపించాయి.వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారూ. ఆ దేశ కరెన్సీ, ఆయుధాలపై కంగారూల ముద్రలుంటాయి. ఆస్ట్రేలియాలో పనిచేసే చాలా సంస్థలు కంగారూల ట్రేడ్ మార్క్‌ను వాడుతుంటాయి. చిత్రమేంటంటే... ఈ జంతువులు ఆస్ట్రేలియాలోని టాస్మేనియా, న్యూగినియాలో తప్ప ప్రపంచంలో మరే దేశంలోనూ లేవు. అందువల్ల కంగారూ అంటే ఆస్ట్రేలియా జంతువుగానే గుర్తిస్తాం. కానీ అవి ఇండియాలో కనిపిస్తే ఒకింత ఆనందం, ఆశ్చర్యం కలగడం సహజమే. నెటిజన్లతోపాటూ... అటవీ అధికారులు కూడా ఈ వీడియోలను చూసి మొదట ఆశ్చర్యపోయారు. వేల కిలోమీటర్ల సముద్రాన్ని దాటి అవి జలపాయ్‌గురికి ఎలా వచ్చాయో అనే డౌట్ అందిరికీ వచ్చింది. గత వారం గజోల్ దోబా ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా తీవ్ర గాయాలతో ఉన్న మూడు కంగారూలను అటవీ అధికారులు, పోలీసులూ కలిసి కాపాడారు.
మూడు కంగారూలను కాపాడిన అటవీ అధికారులు సిలిగురి దగ్గర్లో చనిపోయిన ఓ కంగారూ పిల్లని చూశారు. కాపాడిన కంగారూలకు కూడా గాయాలున్నాయి. వీటిని స్మగ్లర్లు ఇండియాకి తీసుకొచ్చినట్లు తెలిసింది. స్మగ్లర్ల నుంచి తప్పించుకున్న కంగారూలు... రోడ్లపైకి వచ్చినట్లు తెలిసింది. ఈ కంగారూలను చికిత్స నిమిత్తం బెంగాల్ సఫారీ పార్క్‌కు తరలించారు. అయితే నెల రోజుల వ్యవధిలోనే ఐదు కంగారూలను అధికారులు గుర్తించారు. అంతకుముందు, ఈ నెల ప్రారంభంలో ఆస్ట్రేలియన్ కంగారూను అక్రమంగా తరలిస్తుండగా అలిపుర్దౌర్ జిల్లా పక్రిబారిలో పట్టుకున్నారు. ఈ కంగారూను అసోంలోని గువాహటి నుంచి తీసుకొచ్చారని... దానిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, సోమవారం మరో రెండు కంగారూలు రోడ్డుపై కనిపించాయి.
ALSO READ Viral News: పాపం.. ఈమె పరిస్థితి ఎవరికీ రాకూడదు.. జీవితంలో కనీసం ఒక్కసారి కూడా అలా జరగలేదు..
అయితే అసలు ఈ కంగారూలు పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారనే దానికి సంబంధించిన వివరాలపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అటవీ అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో కంగారూలను కృత్రిమంగా పెంచి, వాటిని అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కంగారూలను కృత్రిమ గర్భధారణ ద్వారా పెంచుతున్నారని జల్ పాయ్ గురి సైన్స్ అండ్ నేచర్ క్లబ్ సెక్రటరీ రాజారౌత్ అన్నారు. మయన్మార్ మీదుగా వీటిని ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌గా కనిపిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mizoram