చరిత్ర పొడవునా బ్రాహ్మణులే ఆదిపత్యాన్ని ప్రదర్శించే సినీ సంగీతరంగంలో దళిత సంచలనంగా మొదలై, మిగతా ఎవరికీ సాధ్యపడని రీతిలో ‘మ్యూజిక్ మెస్ట్రో’అనే కీర్తిగణించారు ఇళయరాజా. దశాబ్దాలపాటు దేశాన్ని ఉర్రూతలూగించే సంగీతాన్ని అందించిన ఆయన ప్రస్తుతం 78 ఏళ్ల వయసులోనూ యువ సంగీతకారులతో కలిసి పనిచేస్తూ సత్తా చాటుకుంటున్నారు. తాను ట్యూన్ చేసిన పాటలకు రాయల్టీ చెల్లించకుండా మ్యూజికల్ నైట్స్ లో పాడటానికి వీల్లేదంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికే లీగల్ నోటీసులు పంపిన ఉదంతంలో కోర్టు తీర్పు ఇళయరాజాకు అనుకూలంగా రావడం తెలిసిందే. ద్రవిడ వాదానికి పుట్టినిల్లయిన తమిళనాడులో పుట్టినా, కింది నుంచి ఎదిగి వచ్చినా, కులపోరాటాలకు, అంబేద్కర్, పెరియార్ ఐడియాలజీకి దూరం పాటించిన ఇళయరాజా చాలాసార్లు విమర్శలకు గురయ్యారు. అయితే ఇప్పుడు రాజా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ను ప్రధాని నరేంద్రమోదీతో పోల్చిన మెస్ట్రోపై సర్వత్రా విమర్శలు, ఆరోపణలు, దూషణలు వెల్లువెత్తుతున్నాయి..
‘అంబేడ్కర్ అండ్ మోడీ:రీఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మెర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే పుస్తకానికి ఇళయరాజా రాసిన ముందుమాట వివాదాస్పదమైంది. తమిళనాడు సహా పలు రాష్ట్రాల దళిత సంఘాలు, నెటిజన్లు మెస్ట్రోపై మండిపడుతున్నాయి. మోదీని అంబేడ్కర్‌తో పోల్చడమేంటని విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ-హిందూత్వ ఐడియాలజీ అమలులో భాగంగా తీసుకొచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు వివాదాస్పద చట్టాలనూ ఇళయరాజా ప్రశంసించారు. పేరుకు ఈబీసీ అయినా వ్యవహారంలో అగ్రవర్ణానికి దగ్గరగా ఉండే కులంలో పుట్టిన మోదీతో దళితరత్నం అంబేద్కర్ కు పోలికేంటని తమిళనాడు అధికార డీఎంకే పార్టీనేతలు తిట్టిపోస్తున్నారు.
ఆ పుస్తకం ముందుమాటలో..‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రధాని మోదీ వ్యక్తిత్వాల మధ్య ఆకట్టుకునే సామ్యమైన అంశాలు కొన్నింటిని పుస్తకంలో ప్రస్తావించారు. ఈ ఇద్దరూ సామాజికంగా బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొనే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించినవారు. ఇద్దరూ పేదరికాన్ని అనుభవించారు. సామాజిక అణిచివేతను దగ్గరగా చూసినవారు. పేదరికాన్ని, అణిచివేతను కూల్చేసేందుకు కృషిచేసినవారు. ఇద్దరూ దేశం కోసం పెద్దపెద్ద కలలు కన్నారు. వాటిని ఆచరణలో అమలుచేయాలని భావించారు’ అని ఇళయరాజా పేర్కొన్నారు. అంతేకాదు,
(ముస్లిం)మహిళలకు అనుకూలమైన ట్రిపుల్ తలాక్ చట్టం, బాలికా విద్యకు బేటీ బచావో..బేటీ పడావో లాంటి పథకాలను అమలుచేసిన ప్రధాని మోదీని చూసి అంబేద్కర్ గర్వపడతారని కూడా ఇళయరాజా ప్రశంసించారు. కాగా, పలు పార్టీల నేతలు, నెటిజన్లు.. ఇళయరాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజావి పరువు, బరువు తక్కువ మాటలని తిట్టిపోశారు. వర్ణవ్యవస్థలో అణిచివేతకుగురైన దళితల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ పనిచేస్తే.. మోదీ మనుధర్మ వ్యవస్థకు చెందినవారని.. ఇద్దరిని పోల్చడానికి వీలులేదని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఎలంగొవాన్ విమర్శించారు.
మెస్ట్రో పోలికపై కమళదళం కూడా ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన సంక్షేమపథకాలను దృష్టిలో ఉంచుకునే మోదీని ఇళయరాజా ప్రశంసించి ఉంటారని భావిస్తున్నట్టు బీజేపీ అధికారప్రతినిధి నారాయణన్ తిరుపతి అభిప్రాయపడ్డారు. కాగా, బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం ఆవిష్కరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambedkar, Bjp, DMK, Pm modi, Tamil nadu