మీకు బైక్ ఉందా? మీరు కార్ ఓనరా? రోడ్డు మీద సరిగానే డ్రైవ్ చేస్తున్నారా? లేకపోతే ఇష్టం వచ్చినట్టు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తే, ఇకపై రెండు రకాలుగా నష్టం భరించాల్సి రావొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా విషయంలో కొన్ని కీలక నిబంధనలు తీసుకురాబోతోంది. కేంద్ర రవాణామంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఓ స్కీమ్‌ను అమలు చేయాలని భావిస్తోంది. ఇకపై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే, వారికి వెంటనే పోలీసులు చలానా విధిస్తారు. అయితే, ఆ కథ అంతటితో ముగిసిపోదు. మీ డేటా వాహన ఇన్సూరెన్స్ కంపెనీలకు చేరుతుంది. ఆ తర్వాత మీరు వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ ప్రీమియం పెరుగుతుంది.
రాష్ట్రాల్లో పోలీసు శాఖలు - ఐఆర్‌డీఏ మధ్య అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త సాఫ్ట్‌వైర్‌ను తయారు చేయనున్నట్టు సమాచారం. దీంతో ట్రాఫిక్ చలాన్ రాసిన వెంటనే ఆ డేటా ఐఆర్డీఏకి చేరిపోతుంది. గత ఐదేళ్ల కాలంలో మీరు ఎక్కడెక్కడ ఎన్ని సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారో తెలుసుకునేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎన్ని ఎక్కువసార్లు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అంత ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుందన్నమాట.
అసలు ఇన్సూరెన్స్ తీసుకుంటే కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఇన్సూరెన్స్ లేకపోయినా, ఆ విషయం పోలీసులకు కూడా తెలిసిపోతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, ఇన్సూరెన్స్ తీసుకోకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటారు.
ఈ కొత్త ప్రతిపాదన వల్ల దేశంలో ప్రమాదాల సంఖ్య కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. దేశంలో ప్రతి ఏటా 5లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో లక్షన్నరకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.