న్యూఢిల్లీ: శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రోగి చనిపోతే అన్ని సందర్భాల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్లే పేషంట్ ప్రాణాలు కోల్పోయాడని భావించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల చనిపోయినట్లు సరైన మెడికల్ ఎవిడెన్స్ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్‌సీడీఆర్‌సీ ఓ వైద్యుడి విషయంలో ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఏఎస్ బొప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శస్త్ర చికిత్స విజయవంతం కాకుండా పేషంట్ చనిపోయిన ప్రతి సందర్భంలో.. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయానికి రావడం సమంజసం కాదని బెంచ్ అభిప్రాయపడింది.
శస్త్ర చికిత్స సందర్భంలో ఓ పేషంట్ చనిపోతే.. ఆ పేషంట్ తరపు వారు వైద్యుడి నిర్లక్ష్యం వల్లే అతను చనిపోయాడని.. నష్ట పరిహారం చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. దీంతో.. సదరు వైద్యుడు ఆ శస్త్ర చికిత్స తాలూకా రూ.17 లక్షలను వడ్డీతో సహా చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై ఆ వైద్యుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు బెంచ్ ఆ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయినట్లు ఫిర్యాదుదారుడు ఎన్‌సీడీఆర్‌కి ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని తేల్చింది. కేవలం ఆరోపణలతో వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రోగి చనిపోయాడని భావించలేమని స్పష్టం చేసింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాల విషయానికొస్తే.. అక్టోబర్ 8, 1996న ఒక పేషంట్ హాస్పిటల్‌కు వెళ్లింది. ఆమె కుడి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఎడమ కిడ్నీ కూడా హైడ్రోనెప్రోసిస్ బారిన పడటంతో పాడైపోయి గ్రేడ్ II దశలో ఉందని వైద్య పరీక్షల్లో బయటపడింది. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. డిసెంబర్ 6, 1996న ఆ పేషంట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. కిడ్నీలు పాడైన కారణంగా రెండు కిడ్నీలకు ఒకేసారి ఆపరేషన్ చేయలేమని సదరు పేషంట్‌కు, ఆమె భర్తకు వైద్యులు తెలిపారు. తొలుత తక్కువ పాడైన ఎడమ కిడ్నీకి శస్త్ర చికిత్స చేస్తామని.. కుడి కిడ్నీ పూర్తిగా పాడవడంతో తొలగించే పరిస్థితి కూడా ఉందని చెప్పారు.
సర్జన్ చెప్పినట్టుగానే ఎడమ కిడ్నీకి విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. డిసెంబర్ 12, 1996 నాటికి ఆ పేషంట్ ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగుపడింది. డిసెంబర్ 16, 1996న కుడి కిడ్నీకి శస్త్ర చికిత్స జరిగింది. అయితే.. కుడి కిడ్నీకి శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో ఆ పేషంట్ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. బీపీ లెవల్స్ పడిపోయాయి. పల్స్ కూడా తగ్గిపోయింది. డిసెంబర్ 23, 1996న ఆ పేషంట్ గుండెపోటుతో చనిపోయింది. మిగతా పేమెంట్ చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని పేషంట్ భర్తకు ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో గొడవ మొదలైంది. శస్త్ర చికిత్స చేసిన వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. ఆ వైద్యుడిపై, ఆసుపత్రిపై పేషంట్ భర్త కేసు పెట్టాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తాజాగా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆ పేషంట్ చనిపోయినట్లు ఆధారాలు లేవని తేల్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctors, Hospitals, Supreme Court