Petrol Prices: పెట్రోల్ ధరలతో ఇడ్లీ, దోశలకు లింకేంటి? అసెంబ్లీలో దీనిపైనే రచ్చ

ప్రతీకాత్మక చిత్రం

Karnataka Assembly: గత ఐదేళ్లలో రాష్ట్ర సర్కారు ఇంధనంపై వసూలు చేసే పన్నులను పెంచగా.. బీజేపీ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే పెంచిందని, మిగతాదంతా కాంగ్రెస్ సర్కారు పెంచిన పన్నులే ఉన్నాయని అసెంబ్లీలో సీఎం బసవరాజ్ బొమ్మై వివరించారు.

  • Share this:
కర్ణాటకలో అసెంబ్లీ  (Karnataka Assembly) సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. ఆ రాష్ట్రంలో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), గ్యాస్ (LPG) వంటి ఇంధన ధరల (Fuel Prices) పెరుగుదలను నిరసిస్తూ తొలిరోజు కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేశారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shiva kumar) సహా ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీ సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. ఈ నేపథ్యంలో సభలో ఇంధన ధరల పెరుగుదల అంశం చర్చకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (Sidda ramaiah)బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బెంగళూరులో పేరుగాంచిన ఐకానిక్ హోటల్‌లో ఇడ్లీ, దోశల ధరలు ఇంధన ధరల కారణంగానే పెరిగాయని సిద్ధరామయ్య ఆరోపించారు. అయితే సిద్ధరామయ్య వాదనలను సీఎం బసవరాజ్ బొమ్మై (Basavraj Bommai) ఖండించారు.

ఇంధన ధరల పెరుగుదలపై బొమ్మై సమాధానమిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. ఇడ్లీ, దోశల ధరల పెరుగుదల ఇంధన ధరల పెరుగుదల కారణంగా జరిగిందన్న సిద్ధరామయ్య ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు బెంగళూరు రేస్ కోర్సు రోడ్డులో ఉండే పురాతనమైన జనార్దన్ హోటల్‌‌లో ఇడ్లీ, దోశల ధరల గురించి వివరించారు. సీఎం హోదాలో ఉన్న తాను వీటి ధరలు ప్రస్తావించకూడదని.. కానీ తాను కూడా ఈ హోటల్‌ నుంచి ఎంతో రుచికరంగా ఉండే ఇడ్లీ, దోశలను తెప్పించుకుని తింటానని చెప్పారు. కాబట్టి తన సొంత ఆసక్తి కోసం ధరలను తనిఖీ చేశానని బొమ్మై సమాధానమిచ్చారు.

Blue Flag: భారతదేశంలోని మరో రెండు బీచ్‌లకు దక్కిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్.. వివరాలివే..

2017లో జనార్దన్ హోటల్‌లో రెండు ఇడ్లీలు రూ.35గా ఉండగా.. 2019లో వీటి ధర రూ.36గా ఉందని.. కానీ 2021లో రూ.38కి పెరిగినట్లు గుర్తుచేశారు. రెండు, మూడు రూపాయలు పెరగడం పెద్ద విషయమేమీ కాదన్నారు. 2019లో ఒక మసాలా దోశ ధర రూ.80గా ఉండగా.. ఇప్పుడు దాని ధర రూ.90కి పెరిగిందన్నారు. అయితే ఇంధన ధరల్లో మార్పుల కారణంగానే రవాణా ఛార్జీలు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగాయని, అందుకే అల్పాహారం రేట్లు పెరిగాయని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య వాదించారు. ఇడ్లీ, దోశల ధరల గురించే సీఎం ఎందుకు మాట్లాడుతున్నారని.. సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే సిమెంట్, ఇనుము ధరల గురించి సీఎం ఎందుకు ప్రస్తావించడంలేదని సిద్ధరామయ్య నిలదీశారు.

Corona Ex Gratia: కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల ఎక్స్‌గ్రేషియా.. రాష్ట్రాలు ఇవ్వాలన్న కేంద్రం

మరోవైపు గత ఐదేళ్లలో రాష్ట్ర సర్కారు ఇంధనంపై వసూలు చేసే పన్నులను పెంచగా.. బీజేపీ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే పెంచిందని, మిగతాదంతా కాంగ్రెస్ సర్కారు పెంచిన పన్నులే ఉన్నాయని అసెంబ్లీలో సీఎం బసవరాజ్ బొమ్మై వివరించారు. భారత్ ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చతగ్గులు ఉంటాయని తెలిపారు. మోదీ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు కాలానికి అనుగుణంగానే పెరిగాయన్నారు. 1973-79లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.25 నుంచి రూ.3కి అంటే 150 శాతం పెరిగిందని.. 1979-86లో అదే లీటర్ పెట్రోల్ ధర రూ.3.60 నుంచి రూ.8కి అంటే 122 శాతం పెరిగిందని గుర్తుచేశారు.

Explained: 2,500 ఖడ్గమృగం కొమ్ములను దహనం చేస్తున్న అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే..

1993-2000లో లీటర్ పెట్రోల్ రూ.18 నుంచి 28కి అంటే 55 శాతం పెరిగిందని, అదే 2000-07 మధ్య కాలంలో రూ.28 నుంచి రూ.48కి అంటే 70 శాతం ధర పెరిగిందన్నారు. అయితే మోదీ హయాంలో 2014-2021 మధ్య కాలంలో పెట్రోల్ రూ.77 నుంచి రూ.100కి చేరిందని అంటే 30 శాతం మాత్రమే పెరిగిందన్నారు. గతంలో పెరిగిన ధరతో పోలిస్తే ఇది తక్కువే అని సీఎం బొమ్మై ఇంధన ధరల పెంపును సమర్ధించుకున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: