news18-telugu
Updated: November 28, 2020, 1:12 PM IST
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ కొవిడ్-19 పరీక్షకు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) శుక్రవారం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి సీసీఎంబీలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పద్దతుల్లోని లోటుపాట్లను అధిగమిస్తూ సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొత్త పద్దతిని రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరీక్షా పద్ధతిలో .. సేకరించిన ముక్కు స్రావాల నమూనాలను వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం(వీటీఎం) ద్రావణంలోకి ప్రవేశపెట్టి ఒక సీసాలో భద్రపరిచి టెస్టింగ్ సెంటర్లకు తరలిస్తుంటారు.
అయితే ఈ ద్రావణం బయటకు రాకుండా నమూనాలను ప్యాక్ చేయడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వీటీఎం లీక్ అవుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనివల్ల ఆయా నమూనాలు పరీక్షించేందుకు పనికిరాకుండా పోతున్నాయి. అంతేకాకుండా లీకేజీ కారణంగా ఆ నమునాలను తరలించే సిబ్బందికి కూడా ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలోనే పరీక్షలు జరిపిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు.. స్రావాల నమూనాల నుంచి ఆర్ఎన్ఏను సేకరించాల్సిన అవసరం లేని డ్రై స్వాబ్ పరీక్షా పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్దతిలో ఆర్ఎన్ఏను వేరు చేయాల్సిన అవసరం కూడా రాదని, నేరుగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు జరపవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా ఈ పద్ధతికి ఐసీఎంఆర్ ఆమోదం తెలిపింది.
సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెక్నిక్ ద్వారా కరోనా పరీక్షల్లో ఎంతో సమయం ఆదా అవుతుందని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఆటోమేషన్ పద్ధతిలో నిర్వహించే ఆర్ఎన్ఏ వెలికితీత కోసం సమయం ఎక్కువగా పడుతుందని తెలిపారు. అయితే డ్రై స్వాబ్ టెక్నిక్‌ను వాడటం ద్వారా పరీక్షల ఖర్చు సగం వరకు తగ్గుతుందని చెప్పారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 28, 2020, 1:12 PM IST