పంట పొలాలను వేధించే ఆకు ముడత తెగులు (Bacterial blight), బ్లాస్ట్ (Blast) కారణంగా బాస్మతి (Basmati) ధాన్యం పండించే రైతులు నష్టపోతున్నారు. బాక్టీరియల్ బ్లైట్, బ్లాస్ట్ అనేవి బాస్మతి వరి పంటలో అత్యంత వినాశకరమైన వ్యాధులు. వీటివల్ల భారీ స్థాయిలో దిగుబడి తగ్గుతుంది. ఈ వ్యాధులు బాస్మతి ధాన్యం, పంట నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ఈ బాక్టీరియల్ బ్లైట్, బ్లాస్ట్‌ల సమస్యలను ఎలా అధిగమించాలో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన సంస్థ అయిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంస్థ బాక్టీరియా బ్లైట్, బ్లాస్ట్ వ్యాధులకు నిరోధకత గల మూడు మెరుగైన బాస్మతి రకాలను అభివృద్ధి చేసింది.
కొత్త వంగడాలు ఇవే..
IARI పరిశోధకులు 2021లో పూసా బాస్మతి 1847, పూసా బాస్మతి 1885, పూసా బాస్మతి 1886 అనే మూడు మెరుగైన రకాలను అభివృద్ధి చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో తొలిసారిగా ఈ కొత్త రకాల విత్తనాలను రైతులు ఉపయోగిస్తున్నారు. ఈ రకాల విత్తనాలు వాడే రైతులు బాక్టీరియల్ బ్లైట్, బ్లాస్ట్‌ను ఎదుర్కోవడానికి స్ట్రెప్టోసైక్లిన్, ట్రైసైక్లాజోల్ ఫంగిసైడ్ వంటి బ్యాక్టీరియా సంహారక రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. తద్వారా రైతన్నలకు ఇన్పుట్ ఖర్చు ఈ ఏడాది గణనీయంగా తగ్గుతుంది. కూలీ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఫలితంగా బాస్మతి సాగులో విప్లవాత్మక మార్పులు వస్తాయని అధికారులు అంటున్నారు. అలాగే పురుగుమందులు అవసరం లేని ఈ బియ్యం రకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంటుందని పేర్కొన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహకంగా..
ఈ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి మార్గం సుగమం చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇటీవల బాస్మతి బియ్యంలో కొన్ని రసాయనాల వాడకం గురించి దిగుమతి చేసుకునే దేశాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు చాలా ఆందోళన వ్యక్తపరిచాయి. అయితే ఈ కొత్త రకాలు బాస్మతి బియ్యం ఆ దేశాలలోని ఆందోళనలకు చెక్ పెట్టగలవు. రీసెంట్ ఇయర్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రైసైక్లాజోల్ గరిష్ఠ అవశేషాల పరిమితి (MRL)ని 0.01ppmకి తగ్గించాయి. ట్రైసైక్లాజోల్ అనేది నెక్ బ్లాస్ట్ వ్యాధిని నిర్మూలించే బ్యాక్టీరియా సంహారిణిలలో ఒకటి. ఈయూ నిర్ణయంతో బియ్యంలో ఈ రసాయనం తగ్గించాల్సిన అవసరం అత్యవసరంగా మారింది.
కొత్త రకాలతో ఆదాయం పెరిగే ఛాన్స్..
2021-22లో బాస్మతి ఎగుమతుల ద్వారా భారతదేశం రూ.25,053 కోట్లు ఆర్జించింది. ఈ కొత్త రకాలతో ఈ ఆదాయం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్లో పంజాబ్ , హర్యానా , పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని బాస్మతి వరి పండించే ప్రాంతాలలో ఎక్కువ మంది రైతులు వీటిని సేకరించారు. "బాక్టీరియా ఆకు ముడత, బ్లాస్ట్ వ్యాధులకు నిరోధించగల సామర్థ్యం ఉన్న ఈ రకాలు పురుగుమందుల ఖర్చును తగ్గిస్తాయి. తద్వారా ఎకరాకు రూ.2,000 సాగు ఖర్చు తగ్గుతుంది. ఈ రకాలు పురుగుమందుల అవశేషాలు లేని బాస్మతి బియ్యాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి." అని ఈ రకాల ప్రధాన పెంపకందారులు, IARI డైరెక్టర్ ఎ.కె. సింగ్ అన్నారు. 2021లో పుసా బాస్మతి 1847, పూసా బాస్మతి 1885, పూసా బాస్మతి 1886 అభివృద్ధి, విడుదల ఫలితంగా మాలిక్యులర్ మార్కర్ సహాయంతో బాక్టీరియల్ బ్లైట్, బ్లాస్ట్ వ్యాధులకు ఇన్‌బిల్ట్ నిరోధకత ఉన్న మూడు కొత్త బాస్మతి వరి రకాలను ICAR-IARI అభివృద్ధి చేసిందని సింగ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmers, National News