కూనూర్: ఎయిర్ ఫోర్స్‌కు చెందిన Mi-17V5 Helicopterలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌తో పాటు మరో 12 మంది ప్రయాణిస్తుండగా తమిళనాడులో ప్రమాదానికి గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా భారత ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. కాక్‌పిట్‌లో చివరి నిమిషాల్లో జరిగే సంభాషణలు ఈ బ్లాక్ బాక్స్‌లో రికార్డవుతాయి.
ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఈ బ్లాక్ బాక్స్ రికార్డు చేసే సంభాషణలే కీలకంగా మారుతుంటాయి. దీన్ని ఫ్లైట్ రికార్డర్ అని కూడా అంటారు. గురువారం ఉదయం ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అసలు ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందు ఏం జరిగిందనే విషయానికి సంబంధించిన కీలక డేటా ఈ బ్లాక్ బాక్స్‌లో లభించే అవకాశం ఉంది.
ప్రమాదవశాత్తూ విమాన ప్రమాదాలు జరిగితే కారణం ఏంటనే విషయం తెలియడం కోసం విమానాల్లో, హెలికాఫ్టర్లలో ఈ బ్లాక్‌బాక్స్‌ను అమరుస్తారు. ఇది ఒక హార్డ్ డిస్క్ లాంటిదనే చెప్పొచ్చు. కేవలం కాక్‌పిట్ సంభాషణలు మాత్రమే కాదు ఆటోమేటిక్ కంప్యూటర్ అనౌన్స్మెంట్స్, రేడియో ట్రాఫిక్, క్రూతో జరిపే చర్చలు, ప్రయాణికులను ఉద్దేశించి చేసే అనౌన్స్మెంట్స్కు సంబంధించిన డేటా కూడా ఈ బ్లాక్‌బాక్స్‌లో లభిస్తుంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఈ ఫ్లైట్ రికార్డర్లో పైలట్ల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలకు సంబంధించిన డేటా కూడా ఉంటుందని చెబుతున్నారు.
ఇలాంటి విమాన, హెలికాఫ్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్‌లో లభించే డేటా విచారణ అధికారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. గతంలో.. ఉమ్మడి ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా నల్ల కాలువ వద్ద వాతావరణం అనుకూలించక ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఈ బ్లాక్ బాక్స్‌లో కొన్ని సంభాషణలు రికార్డయ్యాయి. ఈ ఫ్లైట్ రికార్డింగ్ డివైజెస్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(FDR). మరొకటి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR).
ఈ CVRలోనే కాక్‌పిట్ శబ్దాలు, పైలట్ల సంభాషణలు రికార్డవుతాయి. ఈ ఫ్లైట్ రికార్డర్లు ఇప్పుడంటే బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటున్నాయని కానీ తొలినాళ్లలో నలుపు రంగులో ఉండేవి. అందుకే వీటికి బ్లాక్ బాక్స్ అని పేరొచ్చింది. సముద్రాల్లో మునిగినా, అత్యధిక ఉష్ణోగ్రతలో మంటల్లో కాలినా లోపల ఉన్న డేటాకు ఏం కాకుండా ఈ బ్లాక్ బాక్స్‌ను తయారుచేస్తారు. సముద్రాల్లో విమానాలు కూలి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ బ్లాక్ బాక్స్‌ల్లో డేటా ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు ఉపయోగపడేది.
వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సెప్టెంబర్ 2న వెళుతున్న సమయంలో వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. ఒక విధంగా చెప్పాలంటే.. హెలికాఫ్టర్ ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదు. అయినప్పటికీ రచ్చబండకు వెళ్లాలని వైఎస్ నిర్ణయించుకున్నారు. హెలికాఫ్టర్ ఎక్కారు. హెలికాప్టర్ రుద్రకోడూరు కొండల మీదుగా వెళ్తోంది. ఆ సమయంలో హెలికాఫ్టర్ అదృశ్యమైందని వార్తలొచ్చాయి. చివరకు హెలికాఫ్టర్ పావురాల గుట్ట వద్ద కూలిపోయినట్లు తెలిసింది. ఆ ఘటన విచారణలో భాగంగా బ్లాక్ బాక్స్ దొరికింది.
కాక్ పిట్ వాయిస్ రికార్డర్లో పైలెట్ల మామూలు సంభాషణలు మాత్రమే రికార్డు కావడం గమనార్హం.. మరి కొద్ది సెకన్లలో ప్రమాదం జరగబోతుందనగా పైలట్లకు వాస్తవ పరిస్థితి అర్థమై ఉండొచ్చని అప్పట్లో పలువురు అభిప్రాయపడ్డారు. రుద్రకోడూరు కొండల ఎత్తును పైలట్లు సడన్‌గా గుర్తించారు. హెలికాప్టర్‌ను పైకి లేపడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ ఘటనలో వైఎస్‌తో పాటు హెలికాఫ్టర్‌లో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.