ముంబై 26/11 ఉగ్రదాడుల్లో అమరుడైన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బీజేపీ భోపాల్ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ వెల్లడించారు. కర్కరేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పారు. సాధ్వీ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించిన కాసేపటికే ఆమె నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రగ్యా వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదురయ్యే పరిస్థితి రావడంతో ఆమె వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
కాగా, మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న సాధ్వీ బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బీజేపీ తరుపన భోపాల్ లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం నిర్వహించిన ఓ ఎన్నికల ప్రచార సభలో హేమంత్ కర్కరేపై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే కర్కరే ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడని అన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా తనను విచారించిన హేమంత్ కర్కరే.. చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. చిత్రహింసలు భరించలేక.. నాశనమైపోతావని అప్పట్లో ఆయన్ను శపించనిట్టు గుర్తుచేశారు. తాను శపించిన 45 రోజులకే ముంబై ఉగ్రదాడిలో అతను చనిపోయాడని సాధ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్వీ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా? అని ప్రతిపక్షాలతో పాటు సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి : నా శాపంతోనే వాడు చచ్చాడు...26/11 ముంబై అమరవీరుడిపై బీజేపీ నేత దిగజారుడు వ్యాఖ్యలు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhopal S12p19, Bjp, Lok Sabha Elections 2019, Madhya Pradesh Lok Sabha Elections 2019, Mumbai attacks