Muzaffarpur Deaths: ముజఫర్‌పూర్‌కి మాటలొస్తే...ఆ ఆవేదన ఇలా ఉంటుందేమో...

నా ఒడిలో ఆడుకుంటూ..బుడిబుడి నడకలు వేస్తూ..బుజ్జిబుజ్జి మాటలతో అల్లరిచేసే పసిమొగ్గలను మృత్యువు కబళిస్తోంది. మెదడువాపు రూపంలో దాడిచేసి నా నుంచి ఒక్కక్కరిగా దూరం చేస్తోంది.

news18-telugu
Updated: June 21, 2019, 5:26 PM IST
Muzaffarpur Deaths: ముజఫర్‌పూర్‌కి మాటలొస్తే...ఆ ఆవేదన ఇలా ఉంటుందేమో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నేను ముజఫర్‌పూర్‌ని..!

కన్నబిడ్డలను పోగొట్టుకొని పుట్టెడు దు:ఖంతో నేను రోదిస్తున్నా..! వారంతా తిరిగిరారని తెలిసినా గుండెలవిసేలా మౌనంగా రోదిస్తున్నా..! వంద మందికి పైగా పసిపిల్లలు నన్ను వీడి గర్భశోకాన్ని మిగిల్చారు. నా కన్నీళ్లను తుడిచేదెవరు? నా బాధను అర్ధం చేసుకునేదెవరు?

నా ఒడిలో ఆడుకుంటూ..బుడిబుడి నడకలు వేస్తూ..బుజ్జిబుజ్జి మాటలతో అల్లరిచేసే పసిమొగ్గలను మృత్యువు కబళిస్తోంది. మెదడువాపు రూపంలో దాడిచేసి నా నుంచి ఒక్కొక్కరిగా దూరం చేస్తోంది. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే ఈ గడ్డను ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం ఆవహించింది. అదే సమయంలో ఏడుపులు, ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది.

దోషులెవరో నాకు తెలుసు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేనున్నా. పసిపిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా...బక్కచిక్కిన శరీరాలతో మృత్యువుతో పోరాడుతున్నా...కన్నీటి కళ్లతో చూడడం తప్ప ఏమీ చేయలేను. మా జిల్లాలో మెదడువాపు వ్యాధి మరణ మృదంగం మోగిస్తోంది. అభంశుభం తెలియని చిన్నారులను దయాదాక్షిణ్యం లేకుండా ఛిదిమేస్తోంది. అందుకే యావత్ దేశం నావైపు అశ్రునయనాలతో చూస్తోంది. అయ్యో పాపం అంటూ...నాపై జాలి చూపిస్తోంది.మరో బాధాకరమైన విషయం ఏంటంటే..నాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన లిచీ పండ్లను నిందిస్తున్నారు. మెదడువాపు వ్యాధికి ఆ పండ్లే కారణమని వేలెత్తి చూపుతున్నారు. రండి..నా గురించి మీకు చెబుతా..!


బీహార్ తొలి జిల్లా తీరాహట్ విభజనతో 18వ శతాబ్ధంతో నా ప్రస్థానం మొదలయింది. రెవిన్యూ అధికారి ముజఫర్ ఖాన్ పేరునే నాకు నామకరణం చేశారు. ఇక్కడ లిచీ పండ్లు ఎక్కువగా పండడంతో అంతర్జాతీయంగా నాకు గుర్తింపు వచ్చింది. అందుకే 'లిచీ భూమి'గా నన్ను పిలుస్తారు. 3,173 చ.కి.మీ వైశాల్యంలో నేను విస్తరించి ఉన్నా. 48,01,062 మంది ప్రజలు నా ఒడిలో నివసిస్తున్నారు. ఇక్కడ హిందీ, మైథిలి ప్రధాన భాషలు. వజ్జిక యాసలోనే ఎక్కువ మంది మాట్లాడతారు. నా అక్షరాస్యతా శాతం 84. అంటే దాదాపుగా నేను విద్యావంతురాలినే. ఇక లింగ నిష్పత్తిని చూస్తే.. ప్రతి వెయ్యి మంది పురుషులకు 900 మంది స్ర్తీలు ఉన్నారు.లిచీ ఒక్కటే నా ప్రత్యేకత కాదు. ఎన్నో విలువైన జాతి రత్నాలను నేను దేశానికి అందించా. స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదిరాం బోస్, జుబ్బా సహాని, యోగేంద్ర శుక్లా, రామ్‌సంజీవన్ థాకూర్, పండిట్ సహదేవ్ ఝా సహా ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డపై పుట్టినవాళ్లే..! దేవకినందన్ ఖత్రి, రామ్‌వృక్ష్ బెనిపురి వంటి కవులు, రామ్ ప్రభాకర్ ప్రసాద్ వంటి రచయితలు, జార్జి ఫెర్నాండెజ్, జయనారాయణ్ నిషద్ వంటి రాజకీయ నేతలూ ఇక్కడి వాళ్లే..!

నాదో చిన్న ప్రశ్న..! నేను ఎన్నో చేశా. ఎంతో ఇచ్చా. కానీ నాకేం దక్కింది? గత పదేళ్లుగా మెదడువాపు వ్యాధితో తల్లడిల్లుతున్నా. ప్రతి ఏటా ఎంతో మంది చిన్నారులను మృత్యువు నా నుంచి దూరం చేస్తున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదు. SKMCH పేరుతో మాకో మెడికల్ కాలేజీ ఉంది. అంతేకాదు జిల్లా ఆస్పత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటి వల్ల ఏం ప్రయోజనం? ఎంతో మంది చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నా వారికి సరైన వైద్యం అందడం లేదు. కనీస వైద్య సదుపాయాలు లేక ఏటా వందల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వాలు చేసే ఇలాంటి ఏర్పాట్ల వల్ల ఉపయోగం ఏంటి?

2014లో 117 మంది చిన్నారులను నా కళ్ల ముందే మృత్యువు ఎత్తుకెళ్లింది. వారిని నాకు శాశ్వతంగా దూరం చేసింది. SKMCH ఆధునీకరిస్తామని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ, పట్నాలోని ప్రభుత్వాలు అప్పుడు నాకు వాగ్ధానమిచ్చాయి. కానీ ఏం జరిగింది? ఏమీ లేదు.

ఈసారి కూడా వందలాది మంది చిన్నారులను మెదుడువాపు వ్యాధి నా కళ్ల ముందే చంపేసింది. చనిపోయిన కొడుకులు, కూతుళ్లను తల్లిదండ్రులు తమ చేతులపై ఎత్తుకొని, గుండెలకు హత్తుకొని రోదిస్తుంటే నా హృదయం ఎలా తల్లడిల్లుతుందో ఒక్కసారి ఊహించుకోండి.


రాజకీయ నేతలు సమూహాలుగా వచ్చి నన్ను ఓదార్చుతున్నారు. గతంలో కూడా ఇలానే ఓదార్చారు. అంతకు మించి ఏమీ చేయలేదు. కేవలం ప్రకటనలతో నా పిల్లలు బతుకుతారా? నిజంగా చిన్నారుల కోసం ఏమైనా చేయదలచుకుంటే...ఇప్పటికీ ఎందుకు చేయడం లేదు. ఓహో.. చిన్నారులకు ఓటు హక్కు ఉండదనా..? వారితో పెద్దగా ప్రయోజనం ఉండదనా..? ప్రభుత్వం, విపక్షం..పార్టీ ఏదైనా వారికి ఓట్లే కావాలి. ప్రజల కన్నీళ్లు అస్సలు పట్టవు కదా..!

ముజఫర్‌పూర్ పేరు వింటే లిచీ పండ్లు గుర్తొస్తాయి. లిచీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇప్పుడదే ప్రపంచం నా వైపు వేలెత్తి చూపిస్తోంది. ఇక్కడ పిల్లల జీవించలేరని.. వారిని కాపాడేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదని యావత్ సమాజం నిందిస్తోంది. మరి దీనికి బాధ్యులెవరు? నా కన్నీళ్లను తుడిచేదెవరు? ఐనా ఏడ్చిఏడ్చి నా కన్నీళ్లు ఇంకిపోయాయిలే..! ఇది నాకేం కొత్త కాదు..! నా బతుకు ఇంతే..! మౌనంగా రోదించడం తప్ప ఇంకేం చేయను....!

(దీపక్ ప్రియదర్శి, న్యూస్ 18 బిహార్)
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>