Supreme Court: భార్యకు విడాకులు ఇవ్వొచ్చు.. మరి పిల్లల పరిస్థితేంటి ?.. మరోసారి తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

భార్యతో విడిపోయినా సరే.. ఆమె ద్వారా కలిగిన సంతనం సంరక్షణ బాధ్యతలను భర్త చూసుకోవాల్సిందే. ఇదే విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది భారత సుప్రీంకోర్టు.

  • Share this:
భార్యాభర్తలు విడిపోతే.. పిల్లల సంరక్షణ, బాధ్యతలను ఇద్దరూ చూసుకోవాలని చట్టం చెబుతోంది. భార్యతో విడిపోయినా సరే.. ఆమె ద్వారా కలిగిన సంతనం సంరక్షణ బాధ్యతలను భర్త చూసుకోవాల్సిందే. ఇదే విషయాన్ని మరోసారి ధ్రువీకరించింది భారత సుప్రీంకోర్టు. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వొచ్చు కానీ, తన పిల్లలకు విడాకులు ఇవ్వలేరని మంగళవారం స్పష్టం చేసింది. దీంతో పాటు పిల్లల పోషణ కోసం ఆరు వారాల్లోగా రూ .4 కోట్లు సెటిల్‌మెంట్‌గా చెల్లించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం అత్యున్నత న్యాయస్థానం సర్వోన్నత అధికారాలను ఉపయోగించుకొని ఈ తీర్పు చెప్పింది. 2019 నుంచి విడిగా ఉంటున్న దంపతులకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది.

జస్టిస్ డీ.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. విడిపోయిన భార్యాభర్తల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ ప్రక్రియ జరగాలని ఆదేశించింది. విచారణ సమయంలో భర్త తరఫు న్యాయవాది వాదిస్తూ.. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇరువర్గాల మధ్య ఒక సెటిల్‌మెంట్ కుదిరిందని చెప్పారు. అయితే తన క్లయింట్‌ వ్యాపారంలో నష్టపోయాడని, అందువల్ల ఆమెకు రూ. 4 కోట్లు చెల్లించేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. "విడాకులు మంజూరు చేసే రోజున రూ.4 కోట్లు చెల్లిస్తామని మీరే అంగీకరించారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులను ఇందులోకి లాగడం సరికాదు. మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వవచ్చు. కానీ పిల్లలకు జన్మనిచ్చినందువల్ల.. వారికి విడాకులు ఇవ్వలేరు. మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. తనను, మైనర్ పిల్లల బాధ్యతలు చూసుకునేందుకు విడిపోయిన మీ భార్యకు ఆ డబ్బు చెల్లించాలి" అని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 1 నాటికి రూ. 1కోటి, సెప్టెంబర్ 30 నాటికి మరో రూ.3 కోట్లు చెల్లించాలని భర్తను ఆదేశించింది.

ముంబైలో రత్నాలు, ఆభరణాల వ్యాపారం చేసే భర్త, అతడి భార్య విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. నిజానికి ఇద్దరు పార్టీల మధ్య 2019 ఆగస్టులోనే విడాకుల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి రెండు వైపుల వారు కట్టుబడి ఉండాల్సిందేనని ధర్మాసనం తెలిపింది. కరోనా లేకపోతే.. 2019లోనే భర్త అగ్రిమెంటు ప్రకారం మొత్తం డబ్బు చెల్లించేవారని బెంచ్ తెలిపింది. అందువల్ల ఇతర కారణాలతో వాయిదాలు కోరడం సరికాదని, విడాకులు మంజూరు చేసే నాటికి డబ్బు చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు దాఖలు చేసిన పిటిషన్లను కూడా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.
Published by:Kishore Akkaladevi
First published: