ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చే వరకు ఢిల్లీలోని 260 ప్రైవేట్ మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 30 తర్వాత దాదాపు 45 రోజుల పాటు ప్రైవేట్ మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దుకాణాల మూసివేత ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం, కొత్త రిటైల్ లైసెన్సింగ్ విధానం నవంబర్ మధ్య నుంచి అమలులోకి వస్తుంది. అప్పటివరకు వీటిని క్లోజ్ చేయనున్నారు. తొలుత ఆర్కే పురం, ఆండ్రూస్ గంజ్, లజపత్ నగర్, పట్పర్గంజ్, రాజౌరీ గార్డెన్, తుగ్లకాబాద్, కోట్ల ముబారక్పూర్, ఇందర్పురి, రాణి బాగ్, రోహ్తాష్ నగర్, జిల్మిల్, పాండవ్ నగర్ మున్సిపాలిటీల్లోని ప్రైవేట్ మద్యం షాపులను మూసివేయనున్నారు.
ఈ షాపులకు మినహాయింపు..
దేశరాజధాని ఢిల్లీలో మొత్తం 849 మద్యం షాపులు ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలో ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోని మూడు ఏజెన్సీలే నిర్వహిస్తున్నాయి. ఈ 849 షాపులు ప్రభుత్వ ఆధీనంలోని ఏజెన్సీల చేతిలో ఉన్నందున వీటికి వినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 16 వరకు వీటిలో అమ్మకాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Corona Ex Gratia: కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల ఎక్స్గ్రేషియా..
మూసివేత వెనుక కారణాలేంటి?
ఢిల్లీ ప్రభుత్వం జూలైలో 2021–22 కోసం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడం, మద్యం మాఫియాను అరికట్టడమే లక్ష్యంతో ఈ నూతన మద్యం పాలసీని రూపొందించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం, నగరంలోని అన్ని మద్యం దుకాణాలను 32 జోన్లుగా విభజిస్తారు. తద్వారా అన్ని ఏరియాల్లో సమానంగా షాపులను కేటాయించనున్నారు. ప్రస్తుతం, కొన్ని వార్డుల్లో 10 మద్యం దుకాణాలు ఉన్నాయి. మరికొన్ని వార్డుల్లో ఒక్కటి కూడా లేదు. అయితే, కొత్త పాలసీతో అన్ని వార్డుల్లో మద్యం దుకాణాలు రానున్నాయి. ఈ పాలసీ అమల్లోకి వచ్చే వరకు.. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Explained: 2,500 ఖడ్గమృగం కొమ్ములను దహనం చేస్తున్న అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే..
మరోవైపు, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ రేట్లతోనే కాకుండా సొంత ధరలు నిర్ణయించి కూడా మద్యం బాటిళ్లు అమ్ముకోవచ్చు. మార్కెట్లో పోటీకి అనుగుణంగా ఆఫర్లు ప్రకటించవచ్చు. ఈ మేరకు వ్యాపారులకు పూర్తి స్వేచ్ఛనిస్తారు. కొత్త పాలసీ ప్రకారం, మద్యం దుకాణాలు సైతం పెద్దవిగా ఉండాలి. అంతేకాదు, వాటిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే ప్రభుత్వం వాటికి అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.
Covaxin Kids : మనదేశంలో చిన్నారులకు త్వరలో కొవాగ్జిన్.. గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్
ఢిల్లీ ప్రభుత్వానికి భారీ ఆదాయం
32 మండలాలకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే నిర్వహించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే, ఈ బిడ్డింగ్ ద్వారా ప్రభుత్వానికి 8,900 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. కొత్త ఎక్సైజ్ పాలసీతో వచ్చే ఏడాదిలో రూ. 10 వేల కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alcohol, Delhi, Liquor policy, Liquor sales, Liquor shops, Wine, Wine shops