HOW VISHNU TIWARI LIVING HIS LIFE AFTER SPENDING 20 YEARS IN JAIL FOR FALSE RAPE CASE ALLAHABAD HIGH COURT RELEASED HIM FULL DETAILS HERE HSN
చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..
జైలు నుంచి విడుదల అయిన విష్ణు తివారీ (Image Credit: Twitter)
నేను జైలుకు వెళ్లిన సమయంలో అంటే 20 ఏళ్ల క్రితం ఎస్టీడీ బూత్ లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతీ ఒక్కళ్ల చేతిలోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి. జైల్లో ఉండగా మొబైల్స్ గురించి వినటమే కానీ, ఇంతవరకు చూడలేదు.
విష్ణు తివారి. తరచూ వార్తలు చదివే అలవాటు ఉన్నవాళ్లకు ఇతడి గురించి తెలిసే ఉంటుంది. 43 ఏళ్ల ఈ వ్యక్తి చేయని తప్పునకు 20 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడిని నిర్ధోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అతడు తన సొంతూరికి వెళ్లిపోయాడు. యవ్వనంలో ఉండగా జైల్లోకి వెళ్లి 43 ఏళ్ల వయసులో తిరిగి బయటకు వచ్చిన విష్ణు తివారీ.. తన భవిష్యత్ జీవితం అగమ్యగోచరంలా మారిపోయిందంటున్నాడు. మార్చి మూడో తారీఖున విడుదలయిన అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎలా తన జీవితాన్ని గడుపుతున్నాడు.? అతడి అనుభవాలు ఏంటి? భవిష్యత్ జీవితంపై అతడికి ఉన్న ఆలోచనలు ఏంటన్నదానిపై ప్రత్యేక కథనం. 20 ఏళ్ల క్రితం ఉన్న అతడి జీవితం, 20 ఏళ్ల తర్వాత ఎలా మారిపోయిందన్నది కళ్లకు కట్టినట్టు చెబుతున్నాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పుర్ కు చెందిన విష్ణుతివారిపై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు పెట్టింది. ’నేను పనికి వెళ్లి తిరిగి వస్తుండగా నాపై అతడు అత్యాచారం చేశాడు. నోరుమూసి, గొంతు నొక్కి కింద పడేసి నాపై బలాత్కారం చేశాడు.‘ అంటూ ఆ మహిళ కేసు పెట్టింది. 2000వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో విష్ణు తివారీ వయసు 23 ఏళ్లు. తాను తప్పు చేయలేదని, నాకేం తెలియదని అతడు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేసు విచారణ సమయంలో మూడేళ్ల పాటు అతడు జైల్లోనే గడిపాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు చివరకు అతడిని దోషిగా తేల్చింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతడికి జీవిత ఖైదును విధించింది.
ఇది కూడా చదవండి: 23 ఏళ్ల వయసులో అత్యాచారం కేసు.. 20ఏళ్ల పాటు జైలు జీవితం.. నిర్దోషిగా హైకోర్టు తీర్పు.. నా చేతిలో ఉన్నది రూ.600 మాత్రమేనంటూ..
అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టుకు వెళ్లాడు. అయితే హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి, తుది తీర్పు వచ్చేసరికి ఏళ్లకు ఏళ్లు గడిచాయి. చివరకు జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ తివారీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో తుది తీర్పును వెల్లడించింది. ’ఈ కేసులో ఇంత జాప్యం జరగడం శోచనీయం. 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా సంబంధిత శాఖ అతడి గురించి పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమే. ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా ఏమీ కనిపించలేదు. వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్టు దాఖలాలు లేవు. ఆమె వద్ద నిందితుడి వీర్యం ఆనవాళ్లు కూడా లేవు. ఆమె గొంతు నొక్కి, కింద పడేస్తే గాయాలయినా కావాలి. ఆ దాఖలాలు కూడా వైద్యుల రిపోర్టులో ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం. అతడి తప్పు లేకున్నా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం శోచనీయం‘ అంటూ అలహాబాద్ హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. హైకోర్టు తీర్పు అనంతరం అతడి విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టింది. మొత్తానికి మార్చి 3వ తారీఖున అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.
‘ మార్చి మూడో తారీఖున నేను జైలు నుంచి విడుదలయ్యాను. నేను అస్సలు చదువుకోలేదు. నిరక్షరాస్యుడిని. జైల్లో ఉన్నప్పుడు మా వాళ్లకు ఉత్తరాలు రాయడానికి కూడా పక్క వాళ్ల సాయం తీసుకునేవాడిని. వాళ్లే నాకు వచ్చిన ఉత్తరాలను చదివి వినిపించేవాళ్లు కూడా. నేను జైలుకు వెళ్లిన సమయంలో అంటే 20 ఏళ్ల క్రితం ఎస్టీడీ బూత్ లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రతీ ఒక్కళ్ల చేతిలోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి. జైల్లో ఉండగా మొబైల్స్ గురించి వినటమే కానీ, ఇంతవరకు చూడలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే వాటిని చూశాను. వాటిని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. మా ఇంట్లో అయిదారు పశువులు ఉండేవి. వాటి ద్వారానే మా అమ్మానాన్నలు జీవనం సాగించేవాళ్లు. ఇప్పుడు ఆ పశువులు లేవు. మా అమ్మానాన్నలు కూడా లేరు. వాళ్లు మరణించిన సమయంలో కూడా నాకు బెయిల్ లభించలేదు. చివరి చూపును కూడా చూసుకోలేకపోయాను. ఈ ప్రపంచం అంతా నాకు కొత్తగా కనిపిస్తోంది. నేనెలా బతకాలో నాకే తెలియడం లేదు. నా కుటుంబంలో నాకు మిగిలి ఉన్నది ఒక్క అన్నయ్య మాత్రమే. ఈ ఆధునిక ప్రపంచంలో ఏమాత్రం చదువు సంధ్యా లేకుండా 43 ఏళ్ల వయసులో కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి? ’ అని విష్ణు తివారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు తన అన్నయ్యకు చెందిన ఓ పూరి గుడిసెలోనే ఓ గదిలో నివసిస్తున్నాడు. అతడికి జరిగిన అన్యాయం గురించి తెలిసి పలు స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దుస్తులతోపాటు ఆర్థిక సాయం కూడా చేశాయి. ప్రస్తుతం ఆ డబ్బులతోనే అతడు తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. దాతలు ఎవరైనా సాయం చేస్తే ఓ దుకాణం పెట్టుకుంటాననీ, మిగిలిన జీవితాన్ని గడుపుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.