ఈ ఏడాది జూలై 1 నుంచి సవరించిన కార్మిక చట్టాల (Amended Labour Laws) కింద నాలుగు కొత్త లేబర్ కోడ్(New Labour Codes)లను ప్రభుత్వం అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కొత్త చట్టాలకు సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ రూపొందించాయి. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి రాగానే ఉద్యోగుల సోషల్ సెక్యూరిటీ మెరుగుపడుతుంది. అలాగే ఉద్యోగి టేక్-హోమ్ శాలరీ (Take-Home Salary), పీఎఫ్ (PF), వర్కింగ్ అవర్స్ (Working Hours)లో కీలకమైన మార్పులు వస్తాయి. ఈ చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలతో ఉద్యోగుల పనుల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులు ఏవో తెలుసుకుందాం.
వర్కింగ్ అవర్స్ ఎలా మారుతాయి?
కొత్త కార్మిక చట్టాలు అమలులోకి రాగానే ముఖ్యంగా పనివేళల్లో మార్పులు వస్తాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం, ఉద్యోగులు రోజుకి 12 గంటలు పని చేసి వారానికి మూడు రోజులు సెలవులు తీసుకోవచ్చు. డైలీ వర్కింగ్ అవర్స్ 12 గంటలకు పెంచి వీక్లీ వర్కింగ్ అవర్స్ 48 గంటలకు కొత్త చట్టాలు పరిమితం చేశాయి. దీనివల్ల ఓవర్‌టైమ్ పేమెంట్స్‌తో 4-డే ఏ వీక్ పద్ధతిని ఎంచుకునే వీలు యజమానులకు ఉంటుంది. అలాగే ఉద్యోగులు వారంలో మూడు రోజులు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం, ఉద్యోగులు వారానికి 48 గంటలకు మించి పని చేస్తే రెగ్యులర్ శాలరీలకు రెట్టింపుగా ఓవర్‌టైమ్ శాలరీలు పొందవచ్చు. ఒకవేళ ప్రతిరోజూ 8 గంటలే పని చేస్తే కేవలం ఒక్క రోజు మాత్రమే సెలవు లభిస్తుంది.
పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్, టేక్-హోమ్ శాలరీల్లో వచ్చే మార్పులు ఏంటి?
టేక్ హోమ్ శాలరీతో పాటు ప్రావిడెంట్ ఫండ్‌లో ఎంప్లాయ్- ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ నిష్పత్తిలోనూ మార్పులు రానున్నాయి. కొత్త కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం, ఉద్యోగి బేసిక్ శాలరీ మొత్తం జీతం (Gross Salary)లో 50 శాతంగా ఉండాలి. అంటే అలవెన్సులు జీతంలో సగానికి ఎక్కువగా ఉండకూడదు. బేసిక్ శాలరీ అనేది పెరిగినప్పుడు ఎంప్లాయ్- ఎంప్లాయర్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ పెరుగుతాయని చెప్పవచ్చు. ఈ కారణంగా కొందరు ప్రైవేటు ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ లేదా చేతికొచ్చే జీతం తగ్గుతుంది. నిజానికి ప్రైవేటు ఉద్యోగులకు జీతం కంటే అలవెన్సులు ఎక్కువ ఉంటాయి.
గ్రాట్యుటీ రూపంలో మెరుగైన పదవీ విరమణ ప్రయోజనాలను పొందాలనుకునే వారికి కొత్త చట్టాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త నిబంధనల ప్రకారం పదవీ విరమణ తర్వాత పొందే డబ్బుతో పాటు గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. తద్వారా రిటైర్మెంట్ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా డీసెంట్‌గా లైఫ్ లీడ్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Epf, Labour, New Labour Codes