ఖైదీలను ఉరి తీసే తలారికి జీతం ఎంత ఉంటుందో తెలుసా..?

సౌదీ అరేబియాలో దోషులను ఉరితీసే తలారికి నెలకు రూ.30వేల జీతంతో పాటు ఒక్కో ఉరికి రూ.15వేలు చెల్లిస్తారు.

news18-telugu
Updated: January 7, 2020, 5:12 PM IST
ఖైదీలను ఉరి తీసే తలారికి జీతం ఎంత ఉంటుందో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశించింది. తీహార్ జైల్లోనే నలుగురు దోషులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్‌ని ఉరి తీయబోతున్నారు. నలుగురు దోషులకు ఒకేసారి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీహార్‌లోని బక్సర్ జైలు నుంచి ఉరితాడులు తీహార్ జైలుకు చేరుకున్నాయని తెలుస్తోంది. నిర్భయ దోషులను పవన్ అనే తలారి ఉరితీస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దోషులను ఉరితీసే తలారిని ఎలా నియమిస్తారు? వారి జీతం ఎంత ఉంటుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మన దేశంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారిక తలారిలు ఉన్నారు. నటా మాలిక్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్ తలారిగా పనిచేశాడు. రికార్డుల ప్రకారం అతడు 25 మందిని ఉరి తీశాడు. నటా మాలికి చివరిసారిగా 2004లో ధనంజయ్ ఛటర్జీని ఉరితీశాడు. పక్కింటి అమ్మాయిని రేప్ చేసిన కేసులో అతడికి ఉరిశిక్ష విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తలారి నటా మాలిక్‌కు నెలకు రూ.10వేల జీతం చెల్లించేది. ఉరి తీసిన ప్రతి సారి రూ.5000-10000 భత్యం ఇచ్చేవారు. ఐతే ఉరి తీసిన తాడుతో నటా మాలిక్‌కు అదనపు ఆదాయం వచ్చేది. ఉరితీసిన తర్వాత ఆ తాడును తానే ఇంటికి తీసుకెళ్లేవాడు.

జైలు నిబంధనల ప్రకారం ఉరి తాడు 6 మీటర్ల పొడవు ఉంటుంది. దోషిని ఉరితీసిన తర్వాత ఆ ఉరితాడును నటా మాలిక్ ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలు చేసేవాడు. వాటితో అందమైన లాకెట్‌లను తయారు చేసి మార్కెట్లో అమ్ముకునేవాడు. ఉరితాళ్లతో చేసిన లాకెట్లను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందని బెంగాలీల నమ్మకం. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ లాకెట్లు వేసుకుంటే ఆ కష్టాల నుంచి బయటపడతారని విశ్వసిస్తారు. అలా ఉరితాడుతో చేసిన ఒక్కో లాకెట్‌ను నటా మాలిక్ రూ.2వేలకు అమ్ముకునేవారు. మన దేశంలో ఎక్కువ జీతం అందుకున్న తలారి మాలిక్. 2008లో మాలిక్ మరణించడంతో ఆయన స్థానాన్ని కుమారుడు మెహ్తాబ్ భర్తీ చేశాడు. నటా మాలిక్‌కు ముందు అతడి తండ్రి, తాత కూడా తలారిగా పనిచేశారు.

ఇక మీరట్‌కు చెందిన పవన్ యూపీ అధికారిక తలారిగా పనిచేస్తున్నారు. పార్ట్‌టైమ్ పనిచేసే ఆయనకు యూపీ ప్రభుత్వం నెలకు రూ.3వేల వేతనం చెల్లిస్తుంది. ఆయన తండ్రి కుల్లు కూడా గతంలో తలారిగా పనిచేశారు. 1960ల్లో యూపీ అధికారిక తలారిగా అహ్మదుల్లా పనిచేశారు. ఐతే ప్రస్తుతం ఆయన ఈ పని చేయడం లేదు. తలారి వృతి క్రూరమైనదని అందుకే మానేసినట్లు ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. 1965 సమయంలో ఒక్క ఉరిశిక్షకు తనకు కేవలం రూ.25 చెల్లించేవారని తెలిపారు.26/11 ముంబై పేలుళ్ల దోషి, పాకిస్తాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్‌ను బాబు అనే తలారి ఉరితీశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం అతడి వ్యక్తిగత వివరాలను బయటపెట్టలేదు. పుణె జైల్లో కసబ్‌ను ఉరితీసినందుకు జైలు అధికారులు అతడికి రూ.5వేలు చెల్లించారు. అతడు మహారాష్ట్రలో కానిస్టేబుల్‌‌గా పనిచేసే వాడని అప్పటి హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరో టెర్రరిస్ట్ యాకుబ్ మెమన్‌ను సైతం అతడే ఉరితీశాడు. కాగా, సౌదీ అరేబియాలో దోషులను ఉరితీసే తలారికి నెలకు రూ.30వేల జీతంతో పాటు ఒక్కో ఉరికి రూ.15వేలు చెల్లిస్తారు.
First published: January 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు