పోలింగ్‌‌కు ముందు ఆప్‌కు షాక్... లంచం కేసులో సిసోడియా ఓఎస్డీ అరెస్ట్

మనీష్ సిసోడియా

Delhi Assembly Elections 2020 : మరో 24 గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కచ్చితంగా గెలుస్తామనే ధీమాలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సిసోడియా ఓఎస్డీ అరెస్టుతో షాక్ తగిలినట్లైంది.

 • Share this:
  Delhi Assembly Elections 2020 : ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆఫీస్‌లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD) గోపాల కృష్ణ మాధవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన రూ.2లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో సివిల్ సర్వీసెస్ చేసిన గోపాల కృష్ణ మాధవ్... ఓ పన్ను ఎగవేత మేటర్‌లో లంచం ఆశించాడు. ఈ విషయం సీబీఐకి తెలిసింది. ప్లాన్ ప్రకారం ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఐతే... ఈ తంతుతో మనీశ్ సిసోడియాకి సంబంధం లేదని తెలుస్తోంది. ఐతే... దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఎవరెవరి హస్తం ఉందో చెప్పలేమంటున్నారు అధికారులు.

  ఢిల్లీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం... 2015లో మనీశ్ సిసోడియాయే... ఈ గోపాల కృష్ణ మాధవ్‌ను OSDగా నియమించారు. ఐతే... శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా... ఈ టైంలో ఈ అరెస్టు జరగడం అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేపింది. ఇంతకుముందు గురువారం.... మనీశ్ సిసోడియాపై క్రిమినల్ కంప్లైంట్ నమోదైంది. డిసెంబర్‌లో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో ఆందోళనలు జరిగినప్పుడు... ఆందోళనకారులు బస్సుల్ని తగలబెట్టారు. ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని సిసోడియా ఆరోపించారు. ఈ కారణంగా ఆయనపై క్రిమినల్ కంప్లైంట్ నమోదైంది.

  ఢిల్లీ ఆప్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా సాగిన ప్రచారం... గురువారంతో ముగిసింది. 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీలో అధికారం చేపట్టాలని చూస్తున్న బీజేపీ... ఆప్‌కి గట్టిగానే సవాల్ విసిరింది. ఐతే... పౌరసత్వ చట్టంపై జరుగుతున్న ఆందోళనలను బట్టి... బీజేపీపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆప్ భావిస్తోంది. అలాగే ఈ ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని అనుకుంటోంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 11న రానున్నాయి.


  Published by:Krishna Kumar N
  First published: