HOME MINISTER AMIT SHAH PROMISE FREE GAS CYLINDERS FOR PEOPLE OF UTTAR PRADESH IF BJP GETS BACK TO POWER AK
Free Gas Cylinder: బీజేపీని గెలిపిస్తే.. హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్.. యూపీలో కీలక హామీ
Free Gas Cylinder: బీజేపీని గెలిపిస్తే.. హోలీకి ఉచితంగా గ్యాస్ సిలిండర్.. యూపీలో కీలక హామీ
BJP: ఫిబ్రవరి 20న జరగనున్న మూడో దశ ఎన్నికల ప్రచారం కోసం ఔరయాలో పర్యటించారు అమిత్ షా. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ, బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయాయని, బీజేపీ 300 సీట్ల మార్కుకు చేరువలో ఉందని అన్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది అధికార బీజేపీ. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూనే.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజలకు పలు హామీలు ఇస్తోంది. తాజాగా మూడో విడత ఎన్నికల కోసం ప్రచారం చేపట్టిన ఆ పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హోలీకి ముందు కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని అన్నారు. ఎస్పీ, బీఎస్పీ తమ ప్రభుత్వాలను 15 సంవత్సరాలు నడిపించాయని.. అయితే ఏ ఇంటికి గ్యాస్ సిలిండర్లు వచ్చాయని అమిత్ షా ప్రజలను ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.66 లక్షల మంది తల్లులకు సిలిండర్లు, స్టవ్‌లు ఉన్నాయని అన్నారు. తాము అధికారంలోకి వస్తే హోలీ, దీపావళికి ఒక సిలిండర్ ఉచితంగా అందించాలని నిర్ణయించామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ విచ్ఛిన్నం చేశాయని అమిత్ షా ఆరోపించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టిన ఘనత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దక్కిందని కొనియాడారు. ఆయనకు మరో అవకాశం ఇస్తే.. యూపీ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తారని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల విషయంలో విజయం సాధించారని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో ఏ మాఫియా మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టగలదా అని ప్రశ్నించారు.
ఎవరైనా మీ భూమిని ఆక్రమించగలరా అని అన్నారు. యోగి ప్రభుత్వ హయాంలో దోపిడీని 72 శాతానికి, హత్యలను 31 శాతానికి, అత్యాచారాన్ని 50 శాతానికి తగ్గించారని అన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎస్పీ, బీఎస్పీ మద్దతు ఇచ్చినప్పుడు, పాకిస్తాన్ నుండి చొరబాటు జరిగిందని.. మన సైనికులను పొట్టనబెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకున్నారని అమిత్ షా అన్నారు.
ఫిబ్రవరి 20న జరగనున్న మూడో దశ ఎన్నికల ప్రచారం కోసం ఔరయాలో పర్యటించారు అమిత్ షా. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ, బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయాయని, బిజెపి 300 సీట్ల మార్కుకు చేరువలో ఉందని అన్నారు. ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చినప్పుడు అఖిలేష్ దానిని మోదీ వ్యాక్సిన్‌గా పేర్కొన్నారని విమర్శించారు. మోదీ 130 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వకుంటే.. మూడో వేవ్‌లో మనం సురక్షితంగా ఉండేవాళ్లమా ? అని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.