దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని అధికార బీజేపీ విపక్షాలను టార్గెట్ చేస్తోందని కొంతకాలంగా కాంగ్రెస్ సహా అనేక విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీన్ని ఆపాలంటూ లేఖలు కూడా రాశాయి. కేవలం విపక్ష నేతలను మాత్రమే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని.. ఇదంతా బీజేపీ(BJP) చేస్తున్న కుట్ర అని విపక్షాలు పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో స్పందించారు. ఇలాంటి విమర్శలు చేస్తున్న వారికి ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎవరిని అనవసరంగా టార్గెట్ చేయడం లేదని అన్నారు. చట్టంపై అందరికీ నమ్మకం ఉండాలని అన్నారు. ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను(Investigative Agencies) దుర్వినియోగం చేస్తోందని వారికి అనిపిస్తే.. వాళ్లు కోర్టును ఆశ్రయించాలని అన్నారు.
కేంద్ర సంస్థల దుర్వినియోగానికి తాను కూడా బాధితుడినే అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఇరికించాలని సీబీఐ తనపై గతంలో ఒత్తిడి తెచ్చిందని ఆయన ఆరోపించారు. అయితే తాము దాని గురించి ఏడ్చి ఏడ్చి చెప్పలేదని అన్నారు. గత ప్రభుత్వం తరహాలో తాము ఎలాంటి తప్పుడు కేసులు నమోదు చేయలేదని అమిత్ షా అన్నారు. తాము అవినీతిపై పోరాటం చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగానే అవినీతిపరుల ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
2004 నుంచి 2014 వరకు ఈడీ మనీ లాండరింగ్ కేసుల్లో రూ. 5000 కోట్ల వెలికితీస్తే... తమ హయాంలో ఈడీ లక్ష కోట్లకు పైగా అవినీతిని వెలికి తీసిందని అమిత్ షా అన్నారు.ఇందులో ఐదు శాతం కూడా రాజకీయ నేతలు లేరని అన్నారు. చట్టాలను ఉల్లంఘించిన వారిపైనే ఈ పోరాటమని అన్నారు. రాజకీయ నేతలు అవినీతికి పాల్పడితే ఎలాంటి చర్యలు ఉండొద్దని ప్రజలు కోరుకుంటున్నారా ? అని ప్రశ్నించారు.
Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్
‘శివసేన మాతోనే ఉంది..ఉద్దవ్ సొంత పార్టీని విడిచిపెట్టాడు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో పీయూష్ గోయల్
కాంగ్రెస్ హయాంలో సీబీఐ 500 కేసులను కూడా వెలికితీయలేదని..తమ హయాంలో 5 వేల కేసులను వెలికితీసిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ పోరాటాన్ని ఆపేయాలా ? అని ప్రశ్నించారు. అయినా ఈ కేసులు నమోదవుతున్న వారిలో రాజకీయ నేతల సంఖ్య చాలా తక్కువ అని అమిత్ షా అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాది మంది అమాయక నాయకులను కటకటాల వెనక్కి నెట్టారని అమిత్ షా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.