హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

శ్రీనగర్ ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ హతం

శ్రీనగర్ ఎన్‌కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా చనిపోయాడు. సైఫుల్లా కాశ్మీర్ వ్యాలీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు.

  హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్, మరో టెర్రరిస్టును భద్రతా బలగాలు హతమార్చాయి. శ్రీనగర్‌లో జరిగిన ఎన్ కౌంటర్లో హిజ్బుల్ చీఫ్ కమాండర్ సైఫుల్లాను హతమార్చాయి. రంగ్రేత్‌లోని పాత ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాల మీద టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా చనిపోయాడు. సైఫుల్లా కాశ్మీర్ వ్యాలీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడు. 2014లో అతడు టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరాడు. భద్రతా బలగాల మీద టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది మేలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ రియాజ్ నైకూ ఎన్‌కౌంటర్లో చనిపోయిన తర్వాత సైఫుల్లా ఆ ప్లేస్‌లోకి వచ్చాడు.

  ‘సైఫుల్లా 2014 నుంచి టెర్రరిస్టు గ్రూపులో యాక్టివ్‌గా ఉన్నాడు. బుర్హాన్‌ వనీతో కలసి పనిచేశాడు. భద్రతా బలగాలు అతడి కదలికలపై రెండు రోజుల నుంచి కన్నేశాయి.’ అని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బగ్ సింగ్ తెలిపారు. ఎన్ కౌంటర్ ప్రదేశంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నాయి.

  హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ సైఫుల్లా హతం కావడం భద్రతా బలగాల ఘన విజయం అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ‘పోలీసులు, భద్రతా బలగాలకు ఇది ఘనవిజయం. ఇదేం చిన్న ఘనత కాదు.’ అని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఎన్ కౌంటర్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కాశ్మీర్ నుంచి సైఫుల్లా ఇక్కడకు వచ్చినట్టు తమకు సమాచారం వచ్చిందని, ఓ ఇంట్లో దాక్కునట్టు తెలిసిందని చెప్పారు. ‘సైఫుల్లా ఇక్కడకు వచ్చినట్టు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఎదురుకాల్పుల్లో టెర్రరిస్టు చనిపోయాడు. అతడు సైఫుల్లా అని మేం 95 శాతం నమ్ముతున్నాం. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని వివరాలు తర్వాత తెలుస్తాయి.’ అని కుమార్ చెప్పారు. జమ్మూకాశ్మీర్ పోలీసుల నెట్ వర్క్ చాలా బలంగా మారిందని, ఏ ఉగ్రవాది అయినా నగరంలోకి ప్రవేశిస్తే కచ్చితమైన సమాచారం వస్తోందని తెలిపారు.

  ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారు. అక్టోబర్ 27న రాత్రి 9 గంటల ప్రాంతంలో గాలింపు జరుపుతున్న భద్రతాదళాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉభయ పక్షాల మధ్య సుమారు 4 గంటలపాటు కాల్పులు జరిగాయని, చివరకు ఇద్దరు టెర్రరిస్టుల మృతదేహాలను కనుగొన్నామని సైనికవర్గాలు తెలిపాయి.

  ఈ ఏడాది సెప్టెంబర్‌లో జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్లు తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ పెట్రోల్ పార్టీ మీద గ్రెనేడ్ దాడి చేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో లాల్ చౌక్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గ్రెనేడ్ దాడితో లాల్ చౌక్ ప్రాంతంలో కలకలం రేగింది. అందరూ భయకంపితులు అయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స కోసం తరలించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Jammu and Kashmir, Terrorists

  ఉత్తమ కథలు