petrol price: బంపరాఫర్ -ఇక బైక్‌పై ముగ్గురు వెళ్లొచ్చట -ఉచిత వ్యాక్సిన్ల కోసమే అధిక ధరలన్న కేంద్ర మంత్రి

ప్రతీకాత్మక చిత్రం

Hike in petrol price due to free Covid vaccines | అవును, ఈ స్టేట్మెంట్ ఎక్కడో వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ లో చదివినట్లుంది కదా ! కానీ వాస్తవానినకి ఇది కేంద్ర సర్కారు వివరణ. ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తున్నందుకే పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచామని సాక్ష్యాత్తూ కేంద్ర పెట్రోలియం శాఖ జూనియర్ మంత్రి చెప్పారు. మరోవైపు పెట్రో ధరలకు పరిష్కారంగా ఒక బైకుపై ముగ్గురు ప్రయాణించాలంటూ బీజేపీ ముఖ్యనేత సూచన చేశారు. వివరాలివి..

  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు మార్కెట్లతో సంబంధం ఉన్నా, లేకున్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పైపైకే పోతున్నాయి. పెట్రో భగభగల కారణంగా రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల రేట్లు కూడా ఆకాశాన్నంటాయి. ధరల నియంత్రణలో కేంద్రం ఫెయిలైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తోంటే, విపక్ష పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాల్లోనే ట్యాక్సుల మోత ఎక్కువగా ఉందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. మొత్తంగా పార్టీలు వేరైనా ప్రజలకు మాత్రం ఊరట ఉండబోదన్నది సుస్పష్టం. అయితే, ఎన్నడూ లేనిది పెట్రోల్ ధరలు ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? ట్యాక్సుల రూపంలోని ఆ సొమ్మంతా ఎటుపోతోంది? అనే సందేహాలకు సాక్ష్యాత్తూ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రివర్యులే సమాదానమిచ్చారు. అదే సమయంలో పెరిగిన పెట్రోల ధరలకు పరిష్కారంగా టూవీలర్ బైకులపై ముగ్గురేసి ప్రయాణించాల్సిందిగా బీజేపీ అధినేతలు సెలవిచ్చారు..

వ్యాక్సిన్ల కోసమే పెట్రో బాదుడు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటానికి కారణం చెప్పారు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి. సోమవారం గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. దేశ ప్రజలందరికీ ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్లు అందిస్తున్నందుకే పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. ఒక్కో వ్యాక్సిన్ డోసు ధర సుమారు రూ.1200 ఉంటుందని, దేశంలోని 130 కోట్ల మందికి రెండేసి డోసుల చొప్పున వ్యాక్సిన్లు అందించడమంటే సాధారణ విషయం కాదని, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ద్వారా వచ్చే డబ్బును వ్యాక్సిన్లకు ఖర్చు చేస్తున్నామన్నారు. స్వయంగా తన శాఖ నిధులను కూడా ఆరోగ్య శాఖకు బదలాయించినట్లు గుర్తుచేశారాయన. ఇంకా,

ధరల నిర్ణయం మాది కాదు
ఉచిత వ్యాక్సిన్లు ఇవ్వడానికే పెట్రోల్ రేట్లు పెంచామన్న కేంద్ర మంత్రి రామేశ్వర్ మరు నిమిషంలోనే మెలిక వివరణ ఇచ్చుకున్నారు. నిజానికి పెట్రోల్ ధరలతో కేంద్ర పెట్రోలియం శాఖకు సంబంధం లేదని, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలే ధరల్ని మార్చుతుంటాయని, ఈ ప్రక్రియను కేంద్ర కామర్స్ శాఖ పర్యవేక్షణ మాత్రమే చేస్తుందని, అయితే, పెట్రోల్ పెంపు ద్వారా వచ్చిన డబ్బును మాత్రం ఉచిత వ్యాక్సిన్ల కోసమే ఖర్చు పెడుతున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. కాగా,

నీళ్ల కంటే పెట్రోల్ చీప్
పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయాలంటే వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచి ఆలోచనే అయినప్పటికీ అందుకు విపక్ష పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలు అంగీకరించడంలేదని కేంద్ర మంత్రి తేలి ఆరోపించారు. ‘రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి చోట్ల పెట్రోల్ పై కేంద్రం పన్నుల కంటే ఆయా రాష్ట్రాలు వసూలు చేస్తోన్న సుంకమే ఎక్కువ. తిరిగి వాళ్లే(విపక్షాలే) పెట్రోల్ ధరల పాపం మోదీపై నెట్టేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాం(మంత్రి కూడా అస్సాంలోని దిబ్రూఘర్ నుంచి ఎంపీగా ఉన్నారు) లో లీటరు పెట్రోల్ పై (దేశంలోనే అతి తక్కువగా) కేవలం రూ.28 పన్ను వసూలు చేస్తున్నారు. విపక్ష పాలిత రాష్ట్రాల్లో అది రూ.40దాకా ఉంటుంది. లీటరు పెట్రోల్ పై కేంద్ర పెట్రోలియం శాఖ వసూలు చేసే పన్ను మహా అయితే రూ.30. అయినా, ఈ రోజుల్లో హిమాలయా మంచినీళ్ల బాటిల్ ధర రూ.100 దాటిపోయింది. ఆ లెక్కన పెట్రోల్ ధర తక్కువన్నట్లే కదా’అని మంత్రి రామేశ్వర్ అన్నారు. మరోవైపు,

బైక్‌పై ముగ్గురు వెళ్లండి..
ఉచిత వ్యాక్సిన్ల కోసమే పెట్రో బాదుడు అని కేంద్ర మంత్రి రామేశ్వర్ గువాహటిలో సెలవివ్వగా, అస్సాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భవేష్ కలితా మరో అడుగు ముందుకేసి ప్రజలకు బంపరాఫర్ ప్రకటించారు. పెట్రో ధరలు భారంగా అనిపిస్తే ఒక బైకుపై ముగ్గేరేసి ప్రయాణాలు చేయాలన్నారు. లేదా కాలినడకను ఎంచుకోవాలని సూచించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.100 దాటిపోగా, సోమవారం(అక్టోబర్ 11) నాటికి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ధరలు సెంచరీ దాటాయి. తాజాగా సోమవారం నాడు లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు ధర పెరిగింది. నేటి పెంపుతో యావరేజ్ గా పెట్రోల్‌ ధర రూ.104.44కు, లీటర్ డీజిల్‌ ధర రూ.93.17 కి చేరింది.
Published by:Madhu Kota
First published: