Medaram : మేడారం జనసంద్రమైంది.. వేలు, లక్షలు కాదు.. కోటానుకోట్ల భక్త జనం మేడారంవైపు సాగుతున్నారు. జంపన్న వాగులో జలకాలాడి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. సమ్మక్క సారాలమ్మ కళ్లారా దర్శించుకునేందుకు భక్త జనం బారులు తీరుతున్నారు. కుంభమేళా తర్వాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఇదే. ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కన్నుల పండువగా జరిగే ఈ గిరిజనుల వేడుక వెనుక చెప్పుకోదగ్గ విశేషాలు చాలానే ఉన్నాయి. మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మేడారం జాతర వెనుక ఓ కథ ప్రాశస్త్యంలో ఉంది. ఒకప్పుడు మేడారానికి చెందిన కొందరు కోయ దొరలు గోదావరీ తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు అక్కడో పాప పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందట. ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క అని పేరు పెట్టారట. ఆమె గ్రామానికి వచ్చినప్పటి నుంచీ పాముకాటుకి గురయిన వాళ్లను తన మహిమలతో బతికించేదట. సంతానం లేనివారికి తన మహిమలతో పిల్లలు కలిగేలా చేసేదట. దాంతో ఊరంతా ఆమెను దేవతగా భావించేదట. ఆ రోజుల్లో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడైన పగిడిద్దరాజు పాలించేవాడు. అతడితో సమ్మక్కకు వివాహం జరిగింది. తరువాత ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. సారలమ్మకు పెళ్లీడు వచ్చాక గోవిందరాజులుతో వివాహం జరిగింది. వారి జీవనం సాఫీగా సాగుతుండగా.. కొన్నాళ్లకు ఆ ఊరిని కరవు రక్కసి అల్లకల్లోలం చేసింది. మూడేళ్లపాటు కరవు బారిన పడిన ఆ ఊరి ప్రజలు కాకతీయులకు కప్పం కట్టలేదు. దాంతో అప్పటి కాకతీయ ప్రభుత్వం గిరిజన గూడాలపై దాడి చేసి బలవంతంగా కప్పం కట్టించుకునే వారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాటానికి దిగారు.
ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద గిరిజనులు కాకతీయ సేనను ఎదురొడ్డి పోరాడారు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు... మేడారం సరిహద్దులోని సంపెంగవాగు వద్ద శత్రువుల్ని నిలువరించే ప్రయత్నంలో నేలకూలారు. ఓటమి భారాన్ని తట్టుకోలేక పగిడిద్దరాజు కుమారుడు జంపన్న సంపెంగవాగులో ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ వీరుడి స్మృతి చిహ్నంగా అది జంపన్న వాగయ్యింది. ఈ దుర్వార్తలతో సమ్మక్క మొదట కుంగిపోయినా మరు నిమిషంలోనే రౌద్రమూర్తిలా మారి కత్తిపట్టి యుద్ధానికి బయలుదేరింది. వీరోచితంగా పోరాడింది. కాకతీయులు ఓడిపోయే దశలో ఉన్నప్పుడు ఓ సైనికుడు సమ్మక్కను వెన్నుపోటు పొడిచి పారిపోయాడు. రక్తమోడుతూ మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లిన సమ్మక్క మలుపు ప్రాంతంలో మాయమైపోయింది. విషయం తెలిసిన కోయగూడెం దివిటీలు పట్టి గాలిస్తే గుట్టమీదున్న నెమలినార చెట్టుకింది పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణ కనిపించింది. అంతలోనే ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కానేకాదు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తీ వీరుడిగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఈ స్థలంలో రెండు గద్దెలు కట్టించి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరిపిస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తా’ అంటూ ఆకాశవాణి వినిపించింది. గిరిజనులు అదే అమ్మ ఆదేశంగా భావించారు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి, సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. అలా మొదలయ్యింది సమ్మక్క, సారలమ్మ జాతర.
నాలుగు రోజుల వేడుక..
ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు జరుగనుందీ జాతర. అంతకన్నా పదిరోజుల ముందు నుంచే పూజలు మొదలు పెట్టి వేర్వేరు ప్రాంతాల నుంచి దేవతామూర్తులను తీసుకువస్తారు. జాతరకు వచ్చే భక్తులు తొలుత ఊరి పొలిమేరలోని జంపన్న వాగులో స్నానం చేస్తారు. ఆ వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంటుంది. ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మల దర్శనానికి బయలుదేరతారు. ఈ వేడుకలో వెదురుకర్ర, కుంకుమభరిణలే ఉత్సవమూర్తులు. మొదటిరోజు సారలమ్మ ఆమె భర్త గోవింద రాజులు, తండ్రి పగిడిద్ద రాజులు గద్దెలపైకి చేరుకుంటారు. సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాలతో ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకువస్తారు. జాతరకు రెండురోజుల ముందే కొత్తగూడ మండలం, పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయలుదేరుతుంది. సారలమ్మ భర్త గోవిందరాజులును ఏటూరు నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి కాక వంశస్థులు తీసుకొస్తారు. చివరగా సమ్మక్కను కుంకుమభరిణ రూపంలో చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్థులు ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా తీసుకువచ్చి గద్దెమీద ప్రతిష్ఠిస్తారు.
వెదురుబొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు తయారుచేసిన కుంకుమ వేసి దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకువస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకితో పది రౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. అప్పుడు కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దేవత రాకతో ఆ ప్రాంతం శివసత్తుల శివాలతో దద్దరిల్లిపోతుంది. మూడో రోజున అమ్మవారి గద్దెను దర్శించి బెల్లం, ధన, వస్తు, ఆభరణాల మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. నాలుగో రోజున అమ్మలిద్దరూ అధికారక లాంఛనాలతో తిరిగి వన ప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది. జాతర సమయంలో భక్తుల రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఓ నెల రోజుల ముందు నుంచే మేడారం వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాయ్యాక సమ్మక్క-సారక్క జాతరకు మరింత గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రజలే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు జాతరకు తరలి వస్తారు. ప్రతిష్ఠాత్మకమైన సమ్మక్క-సారాలమ్మ జాతర కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 1500 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు. జాతర సమయంలో సుమారు మూడు కోట్ల మంది భక్తులు మేడారం తరలి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్
మేడారం జాతర కోసం రాష్ట్ర పర్యాటక శాఖ హెలికాప్టర్ ఏర్పాటు చేసింది. రూ.1,80,000 చెల్లిస్తే హైదరాబాద్ నుంచి మేడారం తీసుకెళ్లి మళ్లీ హైదరాబాద్‌లో దిగబెడతారు. దీనికి చక్కని స్పందన ఉందని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.
Flagged off #MedaramJathara Special heli ride at Begumpet.#SammakkaSaralammaaJathara #Telangana #TelanganaTourism #Hyderabad #Medaram @KTRTRS @trspartyonline pic.twitter.com/xH7xhpP7wx
— V Srinivas Goud (@VSrinivasGoud) February 2, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.