భారీ వర్షాలు కేరళను మరోసారి ముంచేశాయి. వయనాడ్‌లో వరద బీభత్సానికి చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో విమాన సర్వీసులను ఆదివారం వరకు రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లే ఆయా సంస్థలకు చెందిన విమాన సర్వీసులు మూడు రోజుల వరకు రద్దు చేశారు. కేరళలోని స్కూళ్లకు ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో ఆ రాష్ట్ర పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. మొత్తం ఏడు జిల్లాల్లో కుండ పోత వర్షం కురుస్తుండటంతో... అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించి, అధికారులంతా సహయ కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. కేరళతోపాటూ... కర్ణాటక, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురిసి... వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో... నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా జిల్లాలు నీటిలో నానుతున్నాయి. వరదల వల్ల మూడు రాష్ట్రాల్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరో రెండ్రోజులు ఇలాగే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మూడు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 70 మంది దాకా చనిపోయారు. ఒక్క కేరళలోనే మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. మలప్పురం జిల్లాలోని ఎడవన్న ప్రాంతంలో ఓ ఇల్లు కూలి నలుగురు ప్రాణాలు విడిచారు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ జిల్లాలో దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెప్పడి ప్రాంతంలో బండరాళ్లు జారి పడటంతో ఓ మసీదు, ఆలయం, ఎస్టేట్ ఉద్యోగుల క్వార్టర్స్ ధ్వంసమయ్యాయి. మరింత మంది NDRF సిబ్బందిని పంపాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు.
కర్ణాటకలో వరదల్లో వందల మంది చిక్కుకోవడంతో... NDRF, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగాయి. నిన్న రొగ్గి, హలొళ్లి, తదితర ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 25 మందిని ఎయిర్‌ఫోర్స్ రక్షించింది. ఆల్రెడీ 80 వేల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యడియూరప్ప ఏరియల్ సర్వే చేశారు. వరదల్లో ఇప్పటివరకు 12మంది చనిపోయారనీ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు.
ఇక తమిళనాడులోని ఊటీలో భారీ వర్షాలకు ఐదుగురు చనిపోగా... భారీ వర్షాలు, వరదల వల్ల మహారాష్ట్రలో ఈ వారంలో 30 మంది చనిపోయారు. అక్కడ 2లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల వల్ల నిత్యవసరాల ధరలు బాగా పెరిగాయి. రూ.100 ఉండే ఒక కొత్తిమీర కట్ట ప్రస్తుతం రూ.400 పలుకుతోంది. అలాగే రూ.70 ఉండే కేజీ పచ్చిమిర్చి రూ.300 ఉంది. వర్షాలు, వరదలూ ఇలాగే కొనసాగితే... ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుందంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Floods, Karnataka, Kerala rains, Maharashtra floods, Rain