హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Uttarakhand Flood: విశ్వాసాన్ని చాటుకున్న కుక్క.. తన వాళ్ల కోసం మూడు రోజులుగా ఎదురు చూపులు

Uttarakhand Flood: విశ్వాసాన్ని చాటుకున్న కుక్క.. తన వాళ్ల కోసం మూడు రోజులుగా ఎదురు చూపులు

ప్రతీకాత్మక చిత్రం (Photo Courtesy: Priya Parul Singh twitter)

ప్రతీకాత్మక చిత్రం (Photo Courtesy: Priya Parul Singh twitter)

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తపోవన్ డ్యామ్ టన్నెల్ వద్ద వందలాది మంది గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా, తనను రోజూ పలకరించి అన్నం పెట్టే కార్మికులు కనిపించకపోవడంతో ఒక కుక్క మూడు రోజులుగా నిద్రాహారాలు మాని దిగాలుగా ఎదురుచూస్తోంది.

ఇంకా చదవండి ...

కుక్కకున్న విశ్వాసం మరే జంతువుకు ఉండదు. అందుకే చాలా మంది తమ ఇళ్లలో కుక్కను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అన్నం పెట్టిన యజమాని కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధమవుతుంది. తన యజమాని కుటుంబమే తన కుటుంబంగా, వారి రక్షణే తన కర్తవ్యంగా భావిస్తుంటుంది. ఒకవేళ తన యజమాని కనిపించకపోతే నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తుంటుంది. ఇప్పుడు, ఉత్తరాఖండ్ వరద సంబంవించిన ప్రదేశంలో కూడా అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తపోవన్ డ్యామ్ టన్నెల్ వద్ద వందలాది మంది గల్లంతైన సంగతి తెలిసిందే. కాగా, తనను రోజూ పలకరించి అన్నం పెట్టే కార్మికులు కనిపించకపోవడంతో ఒక కుక్క మూడు రోజులుగా నిద్రాహారాలు మాని దిగాలుగా ఎదురుచూస్తోంది. రెస్క్యూ కార్యక్రమాలు చేపడుతున్న సొరంగం వైపుకు వెళ్లి తీక్షణాంగా చూస్తూ అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వరద తలెత్తిన హైడ్రోపవర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూటియా జాతికి చెందిన బ్లాకీ అనే ఒక నల్లని కుక్క ఉండేది. ఈ కుక్క అక్కడే పుట్టి పెరిగింది. ప్రతి రోజు అక్కడ పనిచేసే కార్మికుల వద్దకు రోజూ వచ్చేది. వారు పెట్టే అన్నం తిని ఉదయమంతా అక్కడే ఉండి, సాయంత్రం కొండ దిగువకు వెళ్లిపోయేది. ఆదివారం కూడా అలాగే సాయంత్రం వరకు ఉండి కొండ దిగువకు వెళ్లిపోయింది. ఈ తర్వాతే వరద ప్రాజెక్టును ముంచెత్తింది.

దీంతో అక్కడ పనిచేస్తున్న వారు నీటిలో కొట్టుకుపోయారు. మరికొంత మంది సొరంగంలో చిక్కుకుపోయారు. కుక్క తిరిగొచ్చి చూసే సరికి దానికి తెలిసిన వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంతం మొత్తం కొత్తవాళ్లతో నిండిపోయింది. సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ సిబ్బందికి ఆ కుక్క గురించి తెలియక.. దాన్ని తరిమివేయటం మొదలుపెట్టారు. కానీ, అయినా అది మళ్లీ మళ్లీ అక్కడికి వచ్చేది. అయితే, కొంత మంది స్థానికులు ఈ నల్ల కుక్కను చాలా సార్లు ఇదే ప్రాంతంలో చూశామని, దాని కథ మొత్తం రెస్క్యూ సిబ్బందికి చెప్పారు. దీంతో అప్పటినుంచి రెస్క్యూ సిబ్బంది దానికి తినడానికి తిండి పెడుతూ, రాత్రిళ్లు పడుకోవడానికి గోనె సంచి ఏర్పాటు చేశారు. కాగా, తనకు తిండి పెట్టిన వారు వస్తారని ఈ కుక్క ఎదురు చూస్తోంది.

మూడు రోజులుగా అక్కడే పడిగాపులు..

ఇదిలా ఉంటే ప్రమాదం నుంచి బయటపడిన స్థానికుడు అజీత్ కుమార్ మాట్లాడుతూ "బ్లాకీ కుక్క ఇక్కడే తిరుగుతుండేంది. ఇక్కడి వారికి ఈ కుక్క సుపరిచితం. అనుకోని విపత్తుతో ఈ స్థలం అపరిచితులతో నిండి ఉడటంతో ఏమి పాలుపోని స్థితిలో ఉంది. ఈ సంఘటనలేమీ తెలియని ఈ మూగజీవిని చూస్తుంటే చాలా బాధగా ఉంది.” అని అన్నాడు. ఇక ప్రమాదం నుంచి బయటపడ్డ రాజీందర్ కుమార్ అనే కార్మికుడు మాట్లాడుతూ "బ్లాకీ పగటిపూట ఈ పరిసరాల్లోనే తిరుగుతూ, సాయంత్రం పూట వేరే చోటుకు వెళ్లేది. ప్రస్తుతం మేము దీనికి ఆహారం అందజేస్తున్నాము. అది నిద్రించడానికి ఒక బస్తాను కూడా ఏర్పాటు చేశాం." అని అన్నాడు. కాగా, ఈ సంఘటన చూసి అందిరి కళ్లు చెమర్చుతున్నాయి. దాని విశ్వాసానికి అంతా ముగ్థులవుతున్నారు.

Published by:Hasaan Kandula
First published:

Tags: Dog, Trending videos, Uttarakhand floods, VIRAL NEWS

ఉత్తమ కథలు