దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరోసారి ప్రమాదకర స్థాయికి పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం నాటి లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే కొత్తగా 1.8లక్షల కేసులు, 146 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వాలు వేగవంతం చేశాయి. సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా బూస్టర్(మూడో) డోసు పంపిణీ మొదలైంది. కాగా, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డోసు పొందినవారికి జారీ చేసే సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోదీ పేరు, ఫొటోను తొలగించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ఈ మార్పులు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులిచ్చింది. వివరాలివి..
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రజలు ఇకపై డౌన్‌లౌడ్ చేసుకునే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ బొమ్మ కనిపించదు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడమే ఇందుకు కారణం. ఫిబ్రవరి 10- మార్చి 7 మధ్య ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దరిమిలా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లలో మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ల నుంచి పీఎం మోదీ పేరు, ఫొటో తొలగింపునకు అవసరమైన ఫిల్టర్లను శనివారం రాత్రి నుంచే వర్తింపజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని తెలిపారు. 2021లో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే విధమైన చర్యలు తీసుకోవడం తెలిసిందే.
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. యూపీలో 7దశల్లో, మణిపూర్ లో 2 దశల్లో, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో సింగిల్ ఫేజ్ లోనే పోలింగ్ పూర్తి కానుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడుదశల పోలింగ్ ఉంటుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటోను మొత్తానికే తొలగించాలన్న పిటిషన్లను పలు హైకోర్టులు కొట్టేయడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.