Rahul Gandhi : వాయనాడ్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ రిపోర్టర్‌పై మండిపడటం కలకలం రేపుతోంది. గాలిపోయిందా.. మంచి ప్రశ్నలు అడగు అంటూ ఆ రిపోర్టర్‌పై రాహుల్ ఎందుకు ఫైర్ అయ్యారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మోదీ పదాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యల పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో.. ఆయన లోక్‌సభ పదవిపై అనర్హత వేటు పడిన తర్వాతి రోజు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు. అనర్హత తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్‌మీట్‌లో రాహుల్ తోపాటూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జైరామ్ రమేష్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, అభిషేక్ సింఘ్వీ ఉన్నారు.
అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ.. చాలా చిరాకులో ఉన్నట్లు కనిపించారు. శనివారం ప్రెస్‌మీట్‌లో ఆయన తన సహనాన్ని కోల్పోయారు. ఓ జర్నలిస్టుపై మండిపడుతూ... తీరు మార్చుకోమనీ, సరైన జర్నలిస్టుగా ఉండమని ఫైర్ అయ్యారు.
"జర్నలిస్టులా నటించవద్దు. మీరు మంచి ప్రశ్నలు ఎందుకు అడగరు? మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మీరు నన్ను ఎందుకు సరైన ప్రశ్నలు అడగట్లేదు?" అని రాహుల్ ఎదురు ప్రశ్నించారు. "గాలి పోయిందా (Kyun hawa nikal gayi?)" అని ఫైర్ అయిన రాహుల్.. చిన్నగా నవ్వారు.
#WATCH | "Don’t pretend to be a pressman...Kyun hawa nikal gayi?", says Congress leader Rahul Gandhi to a journalist questioning him on his conviction in 'Modi surname' case pic.twitter.com/SdaaUeraoy
— ANI (@ANI) March 25, 2023
"నా పేరు గాంధీ. సావర్కర్ కాదు. గాంధీలు క్షమాపణ కోరరు" అని రాహుల్ స్పందించారు. మోదీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయడంతో.. దానిపై రాహుల్ ఇలా స్పందించారు.
"నా పని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే దేశంలోని సంస్థలను రక్షించడం, దేశంలోని పేద ప్రజల గొంతును వినిపించడం. ప్రధానమంత్రితో సంబంధాలు కలిగి.. దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానీ వంటి వ్యక్తుల గురించి ప్రజలకు నిజం చెప్పడం" అని రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
తాను జైలు కెళ్లే అంశంపై భయపడట్లేదన్న రాహుల్.. ఏం జరిగినా తన పోరాటం కంటిన్యూ చేస్తానన్నారు. అనర్హత వేటుపడినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. రాహుల్‌కి మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలూ ఆందోళనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi