హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hathras Case: హత్రాస్ బాధితురాలి తల్లిని గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రియాంకా, వీడియో

Hathras Case: హత్రాస్ బాధితురాలి తల్లిని గుండెలకు హత్తుకుని ఓదార్చిన ప్రియాంకా, వీడియో

యూపీలోని హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ వాద్రా

యూపీలోని హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ వాద్రా

రాహుల్, ప్రియాంకా గాంధీలు హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ రోజు వారిద్దరూ హత్రాస్ జిల్లాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

  ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌ ఘటనలో బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మొన్న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వారిని కలిసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యూపీ పోలీసులు వ్యవహరించిన తీరు పెను దుమారానికి దారి తీసింది. పోలీసుల వల్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరువుపోతోందంటూ ఏకంగా బీజేపీ అగ్రనేత ఉమా భారతి వ్యాఖ్యానించారు. ఈక్రమంలో రాహుల్, ప్రియాంకా గాంధీలు హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ రోజు వారిద్దరూ హత్రాస్ జిల్లాకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిని అక్కున చేర్చుకుని ఓదార్చారు ప్రియాంకా గాంధీ. బాధితురాలి తల్లి కూడా ప్రియాంకా భుజంపై వాలి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇది.

  హత్రాస్ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు. ‘యువతిని చూసేందుకు కనీసం ఆఖరి చూపు కూడా బాధిత కుటుంబానికి దక్కనివ్వలేదు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన బాధ్యతలను గుర్తుంచుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది.’ అని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కుటుంబం కోరుతుందని ప్రియాంకా గాంధీ వాద్రా చెప్పారు. అలాగే, ఆ కుటుంబానికి భద్రత కల్పించాలని సూచించారు. ఇక ప్రపంచంలో ఏ శక్తి కూడా హత్రాస్ బాధితుల గొంతు వినిపించనివ్వకుండా అడ్డుకోలేదని రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

  ఈ ఘటన విచారణ అంశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు సరిగ్గా లేదనే ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన యూపీ సర్కార్.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. హత్రాస్ ఘటన విచారణను సీబీఐకు అప్పగించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన కొద్దిసేపటికే యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  మరోవైపు యూపీకి చెందిన ఓ మంత్రి హత్రాస్ ఘటనను ఓ చిన్న ఇష్యూగా కొట్టిపారేశారు. ‘డాక్టర్లు ఇప్పటికే చెప్పారు. హత్రాస్ బాలిక మీద అత్యాచారం జరగలేదని చెప్పారు.’ అని యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయమంత్రి అజిత్ సింగ్ పాల్ అన్నారు. దీంతో ఇప్పటికే మండుతున్న అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ‘అదో చిన్న ఘటన. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’ అని పాల్ అన్నారు. ‘ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తుంటే మనమేం చేయలేం. వాళ్లకేం ఇష్యూలు లేవు. అందుకే చిన్న ఘటనలను పెద్దవి చేస్తున్నారు. వాళ్లు కేవలం ఇష్యూని పెద్దది చేస్తున్నారంతే. ప్రజలకు అవసరమైనదేమీ చేయడం లేదు.’ అని మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి అజిత్ సింగ్ పాల్ వ్యాఖ్యానించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Priyanka Gandhi, Uttar pradesh

  ఉత్తమ కథలు