హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు కావడంతో ఇకపై అందమైన కాశ్మీరీ యువతులను హర్యానా యువకులు పెళ్లిచేసుకోవచ్చని చెప్పారు. ఆర్టికల్ 370, 35ఏ నిబంధనల వల్ల కాశ్మీరీ యువతులు వేరే రాష్ట్రం వారిని పెళ్లి చేసుకుంటే, వారికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై హక్కులు కోల్పోతారు. ప్రస్తుతం 370 రద్దు కావడంతో వారికి దేశం మొత్తంలో అమలయ్యే చట్టాలు అమలవుతాయి. ఫతేహాబాద్‌లో జరిగిన ఓ ర్యాలీలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘హర్యానాలో బాలురు - బాలికల వ్యత్యాసం పెరిగిపోతోందని, ఇలాగే కొనసాగితే మన రాష్ట్రంలో యువకులు బీహార్ నుంచి కోడళ్లను తెచ్చుకోవాల్సి ఉంటుందని మంత్రి ధనకర్ చెబుతుండేవారు. అయితే, ఇప్పుడు మనకి సమస్య లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీరీ యువతులను కూడా హాయిగా పెళ్లిచేసుకోవచ్చు.’ అని ఖట్టర్ అన్నారు.
హర్యానాలో ఒకప్పుడు ప్రతి 1000 మంది బాలురకు 850 మంది బాలికలు ఉండేవారు. ఇప్పుడు ఆ నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 933 మంది బాలికలు ఉన్నారు. ఆడపిల్లలను చంపడం, భ్రూణహత్యలను నివారించడం వల్ల ఇది సాధ్యమైందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు.
కొన్నిరోజుల క్రితం యూపీలోని ముజఫరాబాద్‌కు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధి కూడా కాశ్మీర్ యువతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో తెల్లటి కాశ్మీరీ యువతులను పెళ్లి చేసుకోవచ్చని పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.