హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు స్థానిక బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్నీ ఆనంద్ అరోరా నగర స్ధానిక పరిపాలనా సంస్థల శాఖను కోరారు. 2004 నుంచి 2014 మధ్య భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై హర్యానా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గాంధీ కుటుంబానికి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్‌కు అప్పటి హర్యానా కాంగ్రెస్ సర్కార్ కారుచౌకగా కట్టబెట్టిన ప్లాట్‌ను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది.
2005లో నాటి హర్యానా సీఎం భూపీందర్ సింగ్ హుడా అసోసియేటెడ్ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈప్లాట్‌ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని ఈడీ ఆరోపిస్తోంది. ఇక రాష్ట్రంలో గాంధీ కుటుంబ ఆస్తులపై విచారణ పర్వం కొనసాగుతోందని, గురుగ్రాంలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు కేటాయించిన మరో ప్లాట్‌పైనా ఆరా తీస్తున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబం నిర్వహించే ట్రస్టులకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్ర ప్రభుత్వ సమాచారం నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం గాంధీ కుటుంబ ఆస్తులపై విచారణకు ఆదేశించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana, Rahul Gandhi, Sonia Gandhi