డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్‌రహీమ్‌కు మరో కేసులో జైలు శిక్షపడనుంది. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసుపై తీర్పు వెలువరించిన పంచకుల ప్రత్యేక న్యాయస్థానం..గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దోషిగా తేల్చింది. నలుగురు దోషులకు జనవరి 17న శిక్షలు ఖరారు చేయనుంది. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను రామచంద్ర ఛత్రపతి వెలుగులోకి తెచ్చాడు. డేరా ఘోరాలపై 'పూరా' సచ్ పత్రికలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2002 అక్టోబరులో జర్నలిస్ట్ రామచంద్రను డేరాబాబా అనుచరులు దారుణంగా హత్యచేశారు.
తమ ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో డేరాబాబాకు ఇప్పటికే 20 ఏళ్ల జైలు శిక్షపడింది. ప్రస్తుతంన ఆయన హర్యానాలోని సునారియా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 25న గుర్మీత్ రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పురావడంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీల్లో హింస చెలరేగింది. డేరా బాబా అనుచరులు, అభిమానులు ఆందోళనలతో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఆ అల్లర్లలో 40 మందికిపైగా చనిపోయారు. ఉత్తరాదిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
డేరాబాబా దోషిగా తేలిన నేపథ్యంలో పంచకుల ప్రత్యేక కోర్టు ఆవరణలో పోలీసులు భారీగా మోహరించారు. అటు సిర్సా, సునారియా సహా హర్యానా, పంజాబ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి అసాంఘిక ఘటనలు జరగకుండా నిఘాపెట్టారు. ఐతే జనవరి 17న డేరా బాబాకు ఎలాంటి శిక్ష విధిస్తారన్నదానిపై ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana