ఢిల్లీ జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

కాల్పుల్లో గాయపడిన విద్యార్థిని జమ్మూకాశ్మీర్‌లోని దొడా జిల్లాకు చెందిన షాదబ్ ఫరూఖ్‌గా గుర్తించారు. అతడి ఎడమ భుజంలో బుల్లెట్ దిగడంతో మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేశారు.


Updated: January 30, 2020, 7:20 PM IST
ఢిల్లీ జామియా వర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
కాల్పుల్లో గాయపడిన ఫరూఖ్
  • Share this:
ఢిల్లీలోని జమియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ''ఆజాద్ కావాలా.. తీసుకోండి''.. అంటూ తుపాకీని పేల్చాడు. దుండగుడి కాల్పుల్లో ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జమియాలో కాల్పులు జరిపిన వ్యక్తి మైనర్ అని వెల్లడించారు. ప్రస్తుతం అతడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు.

కాల్పుల్లో గాయపడిన విద్యార్థిని జమ్మూకాశ్మీర్‌లోని దొడా జిల్లాకు చెందిన షాదబ్ ఫరూఖ్‌గా గుర్తించారు. అతడి ఎడమ భుజంలో బుల్లెట్ దిగడంతో మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఎయిమ్స్‌కు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం షాదబ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

కాల్పుల్లో గాయపడిన షాదబ్ ఫరూఖ్


అతడు తుపాకీ ఎక్కుపెట్టి జైశ్రీరాం నినాదాలు చేశాడు. స్వాతంత్ర్యం కావాలా.. తీసుకొండి.. దమ్ముంటే ముందుకు రండి. కాల్చుతా. అని అరిచాడు. కొందరు విద్యార్థులు ముందుకు వెళ్లడంతో కాల్పులు జరిపాడు.
ప్రత్యక్ష సాక్షి, జమియా వర్సిటీ విద్యార్థి
ఈ ఘటనతో జమియా యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ముందుజాగ్రత్తగా జామా మసీదు, ఐటీవో, ఢిల్లీ గేట్ మెట్రో స్టేషన్లను మూసివేశారు. కాగా, సోమవారం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దేశద్రోహులను కాల్చిపారేయాలని పిలుపునిచ్చాడు. ఆయన ప్రసంగం చేసిన కొన్ని గంటల్లోనే ఢిల్లీలోని షాహీన్ బాగ్‌ ప్రాంతంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్‌చల్ చేశాడు. CAAకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని బెదిరించాడు. ఇక ఇవాళ మైనర్ బాలుడు ఏకంగా కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

First published: January 30, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు