Jignesh Mevani : బెయిల్ పై బయటికి రాగానే..పుష్ప డైలాగ్ చెప్పిన జిగ్నేష్ మేవానీ
తగ్గేదే లే అన్న జిగ్నేష్ మేవానీ
Jignesh Mevani Pushpa Dialogue : ప్రముఖ దళిత నాయకుడు, రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ పార్టీ కన్వీనర్ కూడా అయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. గత బుధవారం రాత్రి జిగ్నేష్ ని అసోం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Jignesh Mevani recreates Pushpa dialogue : ప్రముఖ దళిత నాయకుడు, రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ పార్టీ కన్వీనర్ కూడా అయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ చేసిన ట్వీట్లపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. గత బుధవారం రాత్రి జిగ్నేష్ ని అసోం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ట్వీట్‌కు సంబంధించిన కేసులో గుజరాత్ లోని పలన్ పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద గత బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో జిగ్నేష్ మేవానీని అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలన్ పూర్ నుంచి జిగ్నేష్ ని రోడ్డు మార్గంలో అహ్మదాబాద్ కు తరలించిన పోలీసులు మరుసటి రోజు ఉదయం గువాహటి తీసుకెళ్లారు. అయితే ఐదు రోజుల తర్వాత ఈ కేసులో అసోంలోని కోక్రాఝర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏప్రిల్ 25వ తేదీన జిగ్నేష్ కి బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్ పొందిన కొద్ది సేపటికే కొత్త కేసులో జిగ్నేష్ ను అసోం పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. అసోంలో మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ఏప్రిల్ 26న బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు బెయిల్ నిరాకరించి, పోలీసు కస్టడికి పంపించింది. మళ్లీ ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్ మూవ్ చేయగా.. అసోంలోని బార్పేట జిల్లా కోర్టు29న బెయిల్ మంజూరు చేసింది. వెయ్యి రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది.
శుక్రవారం బెయిల్ పై బయటికి వచ్చి రాగానే మీడియా ముందు అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్పాడు జిగ్నేష్ మేవానీ. పుష్ప సినిమాలోని ఝుకేగా నహీ(తగ్గేదే లే)డైలాగ్‌తో ఓ మీడియా ఛానెల్ ముందు పుష్పరాజ్ తరహా మేనరిజాన్ని ప్రదర్శించాడు జిగ్నేష్ మేవానీ. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. అధికార బీజేపీ ఓ మహిళను అడ్డంపెట్టుకుని తనపై కేసులు పెట్టారని విమర్శించారు. ఇప్పటికీ తాను చేసిన ట్వీట్‌కు కట్టుబడి ఉన్నానన్నారు. ఎవరికి తలవంచేది లేదని తేల్చి చెప్పారు. మతపరమైన గొడవలు జరుగుతున్నందున ఒక పౌరుడిగా దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని తాను ప్రధానమంత్రికి చెప్పానని.. భారతదేశ పౌరుడిగా దీనిని అడిగే హక్కు తనకుకు ఉందని జిగ్నేష్ అన్నారు. అంటేకాదు చట్ట సభ ప్రతినిధిగా శాంతిని పాటించాలని ప్రజలను కోరా... అది నా విధి.. అదేగా నేను చేసింది. దానికే కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని జిగ్నేష్ తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశాల మేరకే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారం ఉందని ఓ మహిళను అడ్డుపెట్టుకుని తనపై అక్రమ కేసు బనాయించారని,అయినా తలవంచను అని జిగ్నేష్ మేవానీ అన్నారు. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టే బీజేపీ ఇలా చేస్తోంది అని మేవానీ ఆరోపించారు. అరెస్ట్ వేళ తనకు మద్దతు ఇచ్చిన అసోం ప్రజానీకానికి, కాంగ్రెస్ కు జిగ్నేష్ ధన్యవాదాలు తెలిపారు.
మహిళా కానిస్టేబుల్‌పై దాడి కేసులో జిగ్నేష్ మేవానీని కావాలనే ఇరికించేందుకు ప్రయత్నించారంటూ అసోం పోలీసులపై అక్కడి కోర్టు మండిపడింది. బార్పేట కోర్టు జిగ్నేష్ కి బెయిల్ మంజూర్ చేసే క్రమంలో తీవ్రంగా పోలీసులను మందలించింది. రాష్ట్రాన్ని పోలీస్ స్టేట్‌గా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది.
ఇక, ప్రధాని మోదీపై ట్వీట్స్ చేసిన కేసులో బెయిల్ లభించిన రోజు జిగ్నేష్ మాట్లాడుతూ..."ఇది బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర. నా ప్రతిష్టను దిగజార్చేందుకు వారు ఇలా చేశారు. వారు ఒక క్రమపద్దతిలో ఇలా చేశారు. రోహిత్ వేములకి చేశారు. చంద్రశేఖర్ ఆజాద్‌కి చేశారు.. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తున్నారు"అని అన్నారు.
జిగ్నేష్ మేవానీ గుజరాత్‌లోని వద్గామ్ నియోజక వర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గతంలో న్యాయవాదిగా, పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయన స్వతంత్ర ఎమ్మెల్యే అయినప్పటికీ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటున్నారు. యువనాయకుడు, జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్ తో పాటు ఆయన కూడా కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కన్హయ్య కుమార్ కాంగ్రెస్ లో చేరారు. కానీ మేవానీ మాత్రం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ కు మద్దతు పలికారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.