ఇంటర్ స్టూడెంట్ను దారుణంగా చంపిన ఘటనలో నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించింది. గుజరాత్, రాజ్‌కోట్‌లోని జెట్‌పూర్ పరిధిలోని జెతల్‌సర్ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జయేష్ సర్వయ్య (26) అనే వ్యక్తి ప్రేమ పేరుతో బాలిక వెంటపడేవాడు. బాలిక మాత్రం అతడిని పట్టించుకునేది కాదు. అయితే ఎలాగైనా బాలికకు తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు. మార్చి 16, 2021 సర్వయ్య బాలిక ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని అడిగాగు. నేరుగా అతను ఇంటికే రావడంతో ఈ సారి బాలిక సర్వయ్యను గట్టిగా మందలించింది. దీంతో సర్వయ్య ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలికను కొట్టి, ఇంటి బయటకు లాక్కొచ్చి కత్తితో 34 సార్లు పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాలిక స్పాట్‌లోనే చనిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న బాలిక తమ్ముడు.. సర్వయ్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతని మీద కూడా సర్వయ్య దాడి చేశాడు.
వేగంగా దర్యాప్తు:
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో సర్వయ్య మీద పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ట్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారు. నిందితుడికి మరణశిక్షతోపాటు రూ.5వేల జరిమానా కూడా విధించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు. నేరానికి వారం రోజుల ముందు కత్తి కొనుగోలు చేసేందుకు రాజ్‌కోట్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటిలా పట్టణానికి వెళ్లాడు నిందితుడు. అంటే హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించింది. ఏదో ప్రేమ వ్యక్తపరచడానికి అన్నట్లు బయటకు అబద్ధం చెప్పినా కత్తి కొని.. అదే కత్తిని ఆమె ఇంటికి తీసుకెళ్లడంలో అర్థమెంటో స్పష్టంగా తెలుస్తోంది. ప్రేమిస్తే ప్రేమించాలి.. లేకపోతే చంపేస్తా అన్న మైండ్‌సెట్‌లో సర్వయ్య ఉన్నట్లు క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. సర్వయ్యకు మరణశిక్ష పడిన విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వయ్యకు కోర్టు అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇక ప్రేమ, పెళ్లికి అమ్మాయిలు నిరాకరించడంతో ప్రేమోన్మాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోటా ప్రేమ పేరుతో వేధింపులు జరుగుతూనే ఉంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Death penalty, Gujarat, Minor girl